Tirupati Stampede: తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్
ABN , Publish Date - Jan 09 , 2025 | 11:57 AM
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
తిరుపతి, జనవరి 9: తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం (AP Govt) భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satyaprasad) తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా.. తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను రుయా ఆస్పత్రి వద్ద రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు. ఆపై మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం అండంగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయిన అనంతరం సొంతూర్లకు పంపుతామని, అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్సకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కాగా.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన టోకెన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో ఊపిరాడక అనేక మంది అల్లాడిపోయారు. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అవడంతో.. వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసులు తరలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి ముందు ఇలాంటి ఘటన దురదృష్టకరమని మంత్రులు అన్నారు. అలాగే తొక్కిసలాటపై తిరుపతి పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బైరాగిపట్టడి రామానాయుడు స్కూల్ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కోరారు. అలాగే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకోనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆఫ్ఘాన్‌పై బ్యాన్.. ఇక మీదట నో క్రికెట్
TTD EO: తిరుపతిలో తొక్కిలాటపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..
Read Latest AP News And Telugu News