Share News

Tirupati: 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jan 12 , 2025 | 07:59 PM

ఏజీ అండ్ పీ(AG&P) ప్రథమ్ సహజ వాయువు పైపులైన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ పంపిణీ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు.

Tirupati: 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu Naidu

తిరుపతి: ఏజీ అండ్ పీ(AG&P) ప్రథమ్ సహజ వాయువు పైపులైన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ పంపిణీ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఓ ఇంట్లోకి వెళ్లిన వారిని ఆప్యాయంగా పలకరించారు. సిలిండర్ గ్యాస్, పైప్ లైన్ గ్యాస్ మధ్య తేడాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానే స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టారు. ఆ తర్వాత పర్యావరణహిత ద్విచక్రవాహనాలు ప్రారంభించారు. జెండా ఊపి సీఎన్‌జీ వాహనాల ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడ నిర్వహించిన సభలో ప్రసంగించారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.."తిరుచానూరులో గ్యాస్ వాడుతున్న ఓ ఇంటిని పరిశీలించడం జరిగింది. కట్టెలపొయ్యి నుంచి గ్యాస్ పైపు లైన్ వరకూ రాష్ట్రం ఎదగడం సంతోషంగా ఉంది. అంతరాయం లేని గ్యాస్ అందుబాటులోకి రావడం సంతోషం. త్వరితగతిన అనుమతులు ఇవ్వడం ద్వారా తిరుపతి జిల్లాలో 51 పరిశ్రమలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ద్వారా భవిష్యత్తులో 7.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. పర్యావరణహిత ప్రాజెక్టులను రాష్ట్రంలో ప్రోత్సహిస్తాం. సూర్యఘర్ కుసుమ్ ద్వారా ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీని తయారు చేస్తాం.


ప్రతి ఇల్లు, పరిశ్రమ పైపుడ్ గ్యాస్ లైన్ ద్వారా అనుసంధానం జరగాలని కోరుకుంటున్నా. తక్కువ వ్యయంతో ఎక్కువ మంది ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం జరగాలి. ఏజీ అండ్ పీ ప్రథమ్ రానున్న రోజుల్లో 10 వేల ఉద్యోగాలు, రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ముందుకు రావడం సంతోషంగా ఉంది. దేశంలో 1999 నుంచి విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన ఘనత మనకే దక్కుతుంది. జపనీయుల వలే తెలుగు ప్రజలు 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంటారు. కష్టపడి పని చేసే స్వభావం తెలుగు ప్రజల్లో ఎక్కువ. అదే స్వభావం నంబర్ వన్‌గా మార్చుతుందని ఆకాంక్షిస్తున్నా. సంక్రాంతి పండగ కోసం దేశ, విదేశాల నుంచి స్వగ్రామాలకు తరలివస్తున్న తెలుగు ప్రజలకు స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

SANKRANTI SPECIAL TRAINS: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

CM ChandraBabu: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే

Updated Date - Jan 12 , 2025 | 08:11 PM