Share News

Accident: పరీక్షకు వెళ్తూ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:12 AM

పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డాడో ఇంజనీరింగ్‌ విద్యార్థి. మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది.

Accident: పరీక్షకు వెళ్తూ ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి
భువన్‌మనో (ఫైల్‌ ఫొటో)

వడమాలపేట/బైరెడ్డిపల్లె, మార్చి 22(ఆంధ్రజ్యోతి): పరీక్షకు వెళ్తూ మృత్యువాత పడ్డాడో ఇంజనీరింగ్‌ విద్యార్థి. మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తొట్టంబేడు మండలం పెద్దకనపర్తి గ్రామానికి చెందిన వెంకటరామయ్య కుమారుడు వంశీ(20), బైరెడ్డిపల్లె మండలం గాజీపేటకు చెందిన నరసింహులు కుమారుడు కేఎన్‌ భువన్‌మనో(20) పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. తిరుపతి సమీపంలోని చెర్లోపల్లి అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో జరుగుతున్న ఎన్‌పీ టెల్‌(నేషనల్‌ ప్రోగ్రాం ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌) ఆన్‌లైన్‌ కోర్సు పరీక్ష రాసేందుకు కళాశాల నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. చెన్నై నుంచి కర్నూలుకు జిప్సం లోడ్‌తో వెళుతున్న టీఎన్‌ 23 బీఈ 8084 నంబరు లారీని టోల్‌గేట్‌ సమీపంలోని చెట్టినాడ్‌ హోటల్‌ వద్ద భోజనం కోసం డ్రైవర్‌ రోడ్డు పక్కగా నిలిపే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించేలోపు భువన్‌మనో నడుపుతున్న ద్విచక్ర వాహనం లారీ వెనుక భాగంలో ఢీకొంది. ఈ ఘటనలో భువన్‌మనోకు హెల్మెట్‌ లేకపోవడంతో తల బలంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు.వెనుక కూర్చు న్న వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ధర్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వంశీని 108లో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. భువన్‌మనో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి పంపించారు.అది పూర్తయ్యాక శనివారం రాత్రి భువన్‌ మృతదేహం గాజీపేట చేరింది. ఆదివారం స్వగ్రామంలో భువన్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - Mar 23 , 2025 | 01:12 AM