Crowded: జనసంద్రంగా నాగప్ప చెరువు
ABN , Publish Date - Feb 21 , 2025 | 01:57 AM
ఆవుల పబ్బం పేరుతో 14 గ్రామాల ప్రజలు నిర్వహించే సంక్రాంతి పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది.
చౌడేపల్లె, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆవుల పబ్బం పేరుతో 14 గ్రామాల ప్రజలు నిర్వహించే సంక్రాంతి పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది.చౌడేపల్లె మండలంలోని నుంజార్లపల్లె, సింగిరిగుంట, నూనెముద్దలపల్లె, పేరావాండ్లపల్లె, పరికిదోన, దొనపల్లె, చిన్నకంపల్లె, మల్లెలవారిపల్లె, దిగువమల్లెలవారిపల్లె, సామిరెడ్డిపల్లె, మడుకూరు, మొరంకిందపల్లె, చౌడగానిపల్లె, గడ్డంవారిపల్లెలకు చెందిన ప్రజలు ఆవుల పబ్బం పేరుతో సామూహికంగా నిర్వహించునే పశువుల పండగ సందడి మొదలైంది. ఈసందర్బంగా దిగువమల్లెలవారిపల్లె చాందిని బండిలో కాటమరాజు ఊత్సవమూర్తిని ఏర్పాటుచేసి మంగళవాయిద్యాలు, కోలాటలు, చెక్క భజనలు, బళ్లారి డ్రమ్స్ నడుమ గ్రామాల్లో ఊరేగిస్తూ పరికిదోన వద్ద ఉన్న నాగప్ప చెరువు వద్దకు తీసుకొచ్చారు. దిగువమల్లెలవారిపల్లె నుంచి 4 చాందిని బండ్లు, దొనపల్లె, పరికిదోన, పరికిదోన ఎస్సీ కాలని, పేరాపల్లె, నూనెముద్దలవారిపల్లె గ్రామాల నుంచి చాందిని బండ్లను విద్యుత్ దీపాలు, ప్రభలతో అలంకరించి మంగళవాయిద్యాల నడుమ గ్రామాలలో ఊరేగిస్తూ నాగప్ప చెరువు వద్దకు తీసుకొచ్చారు. గ్రామాల్లో పశువులను ప్రత్యేకంగా అలంకరించి నాగప్ప చెరువు వద్దకు తీసుకొచ్చి కాటమరాజు విగ్రహనికి ప్రదక్షిణలు చేయించారు. కాటమరాజు ఉన్న చాందిని బండి వెంట నాగప్ప చెరువు కట్ట నుంచి దొనపల్లె అటవీ ప్రాంతంలో ఉన్న కాటమరాజు ఆలయం వద్దకు దేవరెద్దు వెంట కోలాహలంగా పశువులు వెళ్లాయి. చాందినిబండ్లను చూసేందుకు 14 గ్రామాల ప్రజలు నాగప్పచెరువు వద్దకు రావటంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది.