Share News

Resco: రెస్కో సర్వం.....అవినీతిమయం

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:29 AM

కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) సర్వం అవినీతి మయంగానే ఉందా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయా? సిబ్బంది నియామకాలు, కొనుగోళ్లు, ఆడిట్‌ రిపోర్టులు, చివరకు మినిట్స్‌ బుక్కుల్లో కూడా అవకతవకలు జరిగాయా? ఇటువంటి అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే లభిస్తోంది.

Resco: రెస్కో సర్వం.....అవినీతిమయం
కుప్పంలోని రెస్కో ప్రధాన కార్యాలయం

కుప్పం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో) సర్వం అవినీతి మయంగానే ఉందా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలో ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయా? సిబ్బంది నియామకాలు, కొనుగోళ్లు, ఆడిట్‌ రిపోర్టులు, చివరకు మినిట్స్‌ బుక్కుల్లో కూడా అవకతవకలు జరిగాయా? ఇటువంటి అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే లభిస్తోంది. సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌ కె.శ్రీలక్ష్మి సుమారు ఆరునెలలపాటు రెస్కో వ్యవహారాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఇక్కడ అవినీతి పక్కా అని తేల్చింది. మరింత లోతైన విచారణ జరిపి, ఆధారాలతో సహా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విచారణాధికారి సిఫార్సు చేశారు.విచారణ నివేదిక సివిల్‌, క్రిమినల్‌, డిసిప్లనరీ అంశాలకు ప్రాధాన్యమిచ్చింది.సిబ్బంది నియామకాలు, సర్వీసులు, పదోన్నతులు, బడ్జెట్టు వినియోగం, జనరల్‌ బాడీ సమావేశాలు, విద్యుత్తు పరికరాల కొనుగోళ్లు, జనరల్‌ బాడీ సమావేశాలు, అక్కడ తీసుకున్న నిర్ణయాలు, జీతభత్యాల పెంపు వంటివి ప్రధానంగా ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మి విచారణ పరిధిలోకి వచ్చాయి. వీటన్నింటిపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. వైసీపీ హయాంలో రెస్కోలో ఇద్దరు అధికారులు ఎండీలుగా పదోన్నతులు పొందారు. 115మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి కేవలం మూడు రోజుల ముందు 52మంది పదోన్నతి పొందారు. టెండర్లు లేకుండానే విద్యుత్తు పరికరాల కొనుగోళ్లు జరిగాయి. ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. వీటన్నింటిపైనా ప్రత్యేకాధికారి విచారణ సాగింది. విచారణ సమయంలో నాలుగైదుసార్లు రెస్కోకు వచ్చిన అధికారి, సిబ్బందిని విచారించడమే కాక, అవసరమైన 30 అంశాలకు సంబంధించిన రికార్డులను ఒక వాహనంలో వేసుకుని మరీ వెంట తీసుకు వెళ్లారు.


నివేదికలో ఏముంది?

విచారణ నివేదిక నిజానికి సుమారు ఏడెనిమిది రోజులముందే చిత్తూరులోని సహకార శాఖ అధికారులకు చేరింది. వారు ఆ నివేదికను రెస్కో ఎండీ సోమశేఖర్‌కు పంపిస్తూ జనరల్‌ బాడీ సమావేశంలో ఉంచి, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కానీ రెస్కో అధికారులు నివేదికను బయట పెట్టలేదు. అయితే ప్రాథమిక విషయాలు బయటకు వచ్చేశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.... రూ.32.26 లక్షలు దుర్వినియోగమైనట్లు నివేదిక తేల్చింది. నారాయణప్ప అనే ఉద్యోగి సమర్పించిన ఐటీఐ సర్టిఫికెట్‌ నకిలీదన్న అనుమానాలు వ్యక్తం చేసింది. జనరల్‌ బాడీ సమావేశాలు జరిపినట్లు, నిర్ణయాలు తీసుకున్నట్లు, వాటిని సమావేశంలోని సభ్యులు అంగీకరించినట్లు మినిట్స్‌ బుక్‌లో తీసుకున్న సంతకాల కచ్చితత్వంపైనా అనుమానాలున్నాయని అభిప్రాయపడింది. అవసరానికి మించి సిబ్బందిని నియమించుకున్నారని, ఉద్యోగంకోసం, పదోన్నతులకోసం సిబ్బంది, ఎండీ స్థాయి హోదాలు నిర్వహించిన అధికారులు సమర్పించిన సర్టిఫికెట్లు, అనుభవ ధృవీకరణ పత్రాలు సైతం నమ్మదగినవి కావని పేర్కొంది. డిపార్టుమెంట్‌ ఆడిటర్లను, అప్పట్లో ఇచ్చిన ఆడిట్‌ రిపోర్టులను కూడా తప్పు పట్టింది. వీటన్నింటిపైనా నిపుణులతో కచ్చితమైన సాంకేతిక పద్ధతుల్లో విచారణ జరిపించి, ఆధారాలు సేకరించి, బాధ్యులపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా సహకార శాఖాధికారులను నివేదికలో ఆదేశించారు. అలాగే రెస్కోలో జరిగిన నియామకాలు, పదోన్నతులు తదితరాలకు సంబంధించి నైపుణ్య పరీక్షల వంటివి నిర్వహించి నిబంధలకు విరుద్ధంగా ఉన్నాయని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరి విచారణ నివేదిక సిఫార్సులు అమలవుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Jan 31 , 2025 | 12:29 AM