Share News

AP News: అడవిలో తప్పిపోయిన బీటెక్ విద్యార్థులు.. ఆపై సుడిగుండంలో పడి..

ABN , Publish Date - Jan 04 , 2025 | 09:48 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న(శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు.

AP News: అడవిలో తప్పిపోయిన బీటెక్ విద్యార్థులు.. ఆపై సుడిగుండంలో పడి..
Seshachalam Waterfalls

అన్నమయ్య: సరదాగా గడిపేందుకు ఎంతో హుషారుగా శేషాచలం వెళ్లిన విద్యార్థులకు అనుకోని ఘటన ఎదురైంది. జీవితంలో ఎప్పుడూ చూడని కఠిన పరీక్ష సవాల్ విసిరింది. విషాదయాత్ర కాస్త విషాదాంతంగా ముగిసింది. వాటర్ ఫాల్స్ చూడాలన్న సరదా వారిని అడవిపాలు చేసింది. ప్రమాదవశాత్తూ ఒకరు మృతిచెందగా.. మిగతా విద్యార్థులంతా అడవిలో తప్పిపోయారు. రాత్రంతా ఆ అడవిలోనూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కథ మలుపు తిరిగింది.


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న(శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అనంతరం సరదాగా ఈతకొట్టేందుకు వాటర్ ఫాల్స్‌లోకి దిగారు. అయితే కాసేపటికే వాటర్ ఫాల్ వద్ద సుడిగుండం ఏర్పడింది. దీంతో ఈతకు దిగిన విద్యార్థి సాయిదత్త అందులో చిక్కుకుపోయాడు. అతడిని రక్షించేందుకు తోటి స్నేహితులు ప్రయత్నించి విఫలం అయ్యారు. చివరికి సాయిదత్త ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.


స్నేహితుడు సాయిదత్త మరణాన్ని దిగమింగుకుంటూ మృతదేహాన్ని తీసుకుని అటవీ మార్గం గుండా మిగిలిన ఐదుగురు విద్యార్థులు బయలుదేరారు. అయితే అప్పటికే సూర్యాస్తమయం కావడం, చీకటి కమ్ముకోవడంతో వారంతా శేషాచలం అడవుల్లో దారితప్పారు. నిన్న సాయంత్రం నుంచీ అర్ధరాత్రి వరకూ అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో ఎవరికి విషయం చెప్పాలో అర్థంకాక బోరున విలపించారు. కాసేపటి తర్వాత ఓ విద్యార్థి ఎట్టకేలకు తాము తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తామున్న లొకేషన్‌ను వారికి షేర్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వేకోడూరు పోలీసులు, అటవీశాఖ అధికారులు వారిని రక్షించేందుకు బయలుదేరారు. అర్ధరాత్రి వేళ విద్యార్థులున్న ప్రాంతానికి చేరుకుని వారిని సురక్షితంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

Updated Date - Jan 04 , 2025 | 09:49 AM