Survey: పీ4 సర్వే ప్రారంభం
ABN , Publish Date - Feb 21 , 2025 | 01:47 AM
పేదరిక నిర్మూలనలో భాగంగా ది గువస్థాయి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం వాటి గుర్తింపుకోసం సర్వే గురువారం నుంచీ ప్రారంభించింది.
చిత్తూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనలో భాగంగా ది గువస్థాయి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం వాటి గుర్తింపుకోసం సర్వే గురువారం నుంచీ ప్రారంభించింది. సచివాలయ ఉద్యోగులు పీ4 సర్వేలో పాల్గొంటున్నారు. తమ క్లస్టర్‌లోని కుటుంబాలకు సంబంధించిన 27 రకాల ప్రశ్నల్ని నింపాల్సి ఉంటుంది.వారి లాగిన్‌లో ఆయా కుటుంబాల వివరాలు ఉంటాయి.ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులున్నారా? కరెంటు, నీళ్ల కనెక్షన్స్ ఉన్నాయా? సెల్‌ఫోన్ ఉందా? రేషన్‌కార్డు ఉందా?.. ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలను నింపుతారు. ఆ ఇంటి సభ్యుడి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ద్వారా ఈ సర్వే పూర్తి చేస్తారు.మొత్తం సర్వేని పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు బాధ్యత వహించనున్నారు.
పీ4 విధానం అంటే....
సీఎం అయ్యాక చంద్రబాబు కుప్పంలో రెండుసార్లు పర్యటించారు.అప్పుడే పీ4 గురించి ప్రస్తావించారు. పేదలకు సాయం చేసేందుకు ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు,ఆయా ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు ముందుకు వస్తున్నారని.. వారందరినీ పీ4 విధానంలో ఒకే గొడుగు కిందికి తెస్తామని చెప్పారు. వారందరి సహకారంతో ఆయా కుటుంబాలను అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నారు.ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆ సమీక్షలో సీఎం ప్రకటించారు.