Share News

Chandrababu Naidu: స్కిల్‌ కేసులో బాబుకు ఊరట

ABN , Publish Date - Jan 16 , 2025 | 03:00 AM

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Chandrababu Naidu: స్కిల్‌ కేసులో బాబుకు ఊరట

  • బెయిల్‌ రద్దు కోరుతూ గత వైసీపీ

  • ప్రభుత్వం వేసిన పిటిషన్‌ కొట్టివేత

  • ఇంటర్‌లొక్యూటరీ దరఖాస్తు వేసిన

  • జర్నలిస్టుపై న్యాయమూర్తి ఆగ్రహం

  • ఈ కేసుతో మీకేం సంబంధమని నిలదీత

  • మళ్లీ ఇలా చేస్తే తీవ్ర చర్యలని హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసినందున బెయిల్‌ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఇప్పటికే చార్జిషీటు దాఖలైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించిన ధర్మాసనం.. దానిని రద్దు చేసేందుకు నిరాకరించింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సూచించింది.


ఇంకోవైపు.. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాలగంగాధర తిలక్‌ దాఖలు చేసిన ఇంటర్‌లొక్యూటరీ దరఖాస్తును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. అసలీ కేసులో మీరెవరు.. మీకేం సంబంధమని జస్టిస్‌ బేలా త్రివేది ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ దరఖాస్తు వేసేందుకు మీకున్న అర్హత ఏమిటి? బెయిల్‌ వ్యవహారాల్లో మూడో పక్షం ప్రమేయం ఎందుకు? సంబంధంలేని బె యిల్‌ వ్యవహారాల్లో ఎలా దరఖాస్తు వేస్తారు? ఇంకోసారి ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని తిలక్‌ను హెచ్చరించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబును 2023 సెప్టెంబరు 9వ తేదీ అర్ధరాత్రి నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. మర్నాడు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆ ఏడాది అక్టోబరు 31న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు తొలుత మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. అదే ఏడాది నవంబరు 20న పూర్తిస్థాయి రెగ్యులర్‌ బెయిల్‌ కూడా మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్‌ రద్దు చేయాలంటూ ఆ మర్నాడే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - Jan 16 , 2025 | 03:01 AM