Share News

Naravari Palle : స్వగ్రామంలో బాబు బిజీ

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:51 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు.

Naravari Palle : స్వగ్రామంలో బాబు బిజీ

  • ఓవైపు సంక్రాంతి సంబరాలు..

  • మరోవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

  • నారావారిపల్లెలో మహిళలు, పిల్లలకు వివిధ పోటీలు

  • ప్రధానాకర్షణగా దేవాన్ష్‌.. పిల్లలతో కలిసి సందడి

  • ఎడ్లబండిపై ఊరంతా తిరిగిన సీఎం మనవడు

  • తరలివచ్చిన నందమూరి రామకృష్ణ,బాలయ్య భార్య, చిన్న కుమార్తె, అల్లుడు

తిరుపతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు. పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌ దంపతులు గ్రామంలో మహిళలకు, పిల్లలకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. గతేడాది సోదరుడు రామ్మూర్తినాయుడి మృతితో ఈ పర్యాయం సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వస్తుందో రాదోనని అందరూ అనుకున్నారు. అయితే పండుగ జరుపుకొన్నా జరుపుకోకపోయినా ఆనవాయితీ ప్రకారం వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌ దంపతులతో పాటు ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు ఎంపీ భరత్‌లతో పాటు సన్నిహిత బంధువులు వచ్చారు.

పోటీలు.. విజేతలకు బహుమతులు

నారావారిపల్లెలోని టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో సోమవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించగా పరిసర గ్రామాలకు చెందిన మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలను చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ఆమె తల్లి వసుంధర తదితరులు పరిశీలించారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున నగదు బహుమతి అందించారు. అనంతరం పిల్లలకు బెలూన్‌ బ్లాస్టింగ్‌, గన్నీ బ్యాగ్‌ రేస్‌, మ్యూజికల్‌ ఛైర్స్‌, లెమన్‌ అండ్‌ స్పూన్‌, పొటాటో గ్యాదరింగ్‌ వంటి పోటీలు నిర్వహించారు.


ఈ పోటీలకు మంత్రి లోకేశ్‌ కొంతసేపు యాంకర్‌గా వ్యవహరించి పిల్లలను ఉత్సాహపరిచారు. ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు బహుమతులుఅందజేశారు. సంబరాల్లో చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ప్రధానాకర్షణగా మారారు. నారావారిపల్లెతోపాటు పరిసరగ్రామాలకు చెంది న పిల్లలతో కలసి కిందనే కూర్చుని చిట్‌చాట్‌ చేశారు. వారి పేర్లు, అభిరుచులు తెలుసుకున్నారు. అలాగే తన ఇష్టాలు కూడా వారితో చెప్పారు. పిల్లలతో కొంతసేపు ఫుట్‌బాల్‌ ఆడారు. అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి మాట్లాడారు. పిల్లల ఆటల పోటీల్లో తానుకూడా పాల్గొన్నారు. బెలూన్‌ బ్లాస్టింగ్‌, గన్నీ బ్యాగ్‌ రేస్‌ పోటీల్లో పాల్గొన్న దేవాన్ష్‌ గన్నీ బ్యాగ్‌ రేసులో కన్సొలేషన్‌ బహుమతి గెలుచుకున్నారు. దేవాన్ష్‌ సాయంత్రం బంధువుల పిల్లలతోకలసి అలంకరించిన ఎద్దులబండిపై గ్రామంలో అటూ ఇటూ తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

బిజీ షెడ్యూల్లోనూ ప్రజల నుంచీ అర్జీలు..

అటు సంబరాల్లో, ఇటు అభివృద్ధి కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు తన కోసం వచ్చిన సామాన్య ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఐజీ శేముషీ బాజ్‌పాయ్‌, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Untitled-6 copy.jpg


అభివృద్ధి పనులకు పునాది రాళ్లు

ఇంకోవైపు.. స్వగ్రామం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా రేవాండ్స్‌ కంపెనీ ద్వారా నారావారిపల్లె రైతులు బలరాం నాయుడు, జ్యోతిలకు డ్రిప్‌ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఊరి పరిసరాల్లోని మూడు సచివాలయాల పరిధిలో అర్హులైన రైతులను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం (ఏపీఎంఐపీ) పరిధిలోకి చేర్చాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు. అలాగే రూ.4.27 కోట్లతో 33 కేవీ ఇన్‌డోర్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సబ్‌ స్టేషన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయడంతో పాటు నారావారిపల్లె పరిధిలో 2 వేల ఇళ్లకు సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను, డిస్కమ్‌ సీఎండీ సంతోషరావును ఆదేశించారు.

  • ఉపాధి హామీ పథకం కింద రూ.3.21 కోట్లతో 26 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పొరుగునే వున్న ఎ.రంగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ కింద ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేసేందుకు శ్రీసిటీ దత్తత తీసుకునే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. రూ.1.10 కోట్ల వ్యయంతో కంప్యూటర్‌ ల్యాబ్‌, ఐఎ్‌ఫపీ ప్యానెల్స్‌, కిచెన్‌ షెడ్‌, డైనింగ్‌ హాల్‌, ఏఐ రోబోటిక్‌ ల్యాబ్‌, క్రీడా సామగ్రి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు.

  • కుప్పంలో 480 అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, పిల్లల సంక్షేమానికి పైలట్‌ ప్రాజెక్టు అమలు చేస్తున్న కేర్‌ అండ్‌ గ్రో సంస్థతో అదే ప్రాజెక్టును తిరుపతి జిల్లావ్యాప్తంగా అమలు చేసేలా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆయన సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసింది. నారావారిపల్లెలోని 8 కేంద్రాలను తొలుత పైలట్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు.


  • ఈజీ మార్ట్‌ సంస్థ- డీఆర్‌డీఏ వెలుగు మధ్య కూడా ఒప్పందం కుదిరింది. దీని ద్వారా నారావారిపల్లె పరిసరాల్లో గ్రామీణ మహిళలు ఇంటివద్ద నుంచే కిరాణా షాపులకు వస్తువులు సరఫరా చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందే కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు.

  • నారావారిపల్లె చుట్టూ ఐదు గ్రామాల పరిధిలోని 200 మంది మామిడి రైతులతో ఎఫ్‌పీవో ఏర్పాటుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ పత్రాలను సీఎం రైతులకు అందజేశారు.

  • నారావారిపల్లె పరిసరాల్లోని 15 మంది ఎస్సీ డ్వాక్రా సంఘాల మహిళలకు డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఈ-ఆటోలు అందజేశారు.

Updated Date - Jan 14 , 2025 | 04:58 AM