CM Chandrababu : బాధ్యత లేదా?
ABN , Publish Date - Jan 10 , 2025 | 03:31 AM
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
అధికారులపై సీఎం సీరియస్
తమాషా అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరం
డీఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ల సస్పెన్షన్
ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, విజిలెన్స్ అధికారి శ్రీధర్ తక్షణ బదిలీ
సమగ్ర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి
ప్రమాదస్థలి పరిశీలన.. బాధితులకు పరామర్శ
చైర్మన్, మంత్రులతో కలిసి పరిస్థితిపై సమీక్ష
అక్కడికక్కడే ఐదుగురిపై వేటు
మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం
తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 5 లక్షల సాయం
గాయపడిన 33 మందికి 2 లక్షల సాయం
తిరుపతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధ్యత లేదా?.. తమాషా అనుకుంటున్నారా? అంటూ తీవ్ర స్వరం వినిపించారు. ఐదుగురు అధికారులపై అక్కడికక్కడే వేటు వేశారు. ఆరుగురిని బలిగొన్న తొక్కిసలాట ఘటన జరిగిన తిరుపతిలోని బైరాగిపట్టెడ కేంద్రం వద్ద విధుల్లో విఫలమైన డీఎస్పీ రమణకుమార్, ఆ కేంద్రం ఇంచార్జి, టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్‌ను బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు గురువారం మఽధ్యాహ్నం విజయవాడ నుంచి విమానంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడినుంచి నేరుగా బైరాగిపట్టెడ చేరుకుని, టోకెన్ల జారీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి చేరుకుని తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అటు తర్వాత టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని అధికారులతో సమావేశమై సమీక్షించారు. చివరగా సాయంత్రం అక్కడే మీడియాతో సమావేశమయ్యారు.
‘‘బుధవారం విశాఖలో ప్రధాని రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేసిన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా విజయవాడ తిరిగి వచ్చీ రాగానే తిరుపతి ఘటన తెలియడంతో మనసు వికలమైంది. అందుకే వెంటనే బయల్దేరి తిరుపతి వచ్చాను. దిద్దుబాటు నిర్ణయాలు, చర్యలు తీసుకునే ముందు ప్రత్యక్షంగా లోటుపాట్లు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఘటనా స్థలాన్ని పరిశీలించాను. గాయపడిన వారితోనూ, అధికారులతోనూ మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను.
తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు టీటీడీ నుంచీ రూ. 25 లక్షలు వంతున ఆర్ఠిక సాయం తక్షణం అందజేస్తాం. మృతుల కుటుంబాలలో ఇంటికి ఒకరికి చొప్పున టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తమిళనాడుకు చెందిన మృతురాలి కుటుంబంలో ఒకరికి ఆ రాష్ట్రంలోని టీటీడీ సంస్థల్లో ఎక్కడైనా ఉద్యోగం ఇస్తాం. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మ అనే మహిళలకు రూ. 5 లక్షలు తక్షణమే ఆర్థిక సాయం అందజేస్తాం. వారు కోలుకునేదాకా మెరుగైన వైద్యం ప్రభుత్వమే అందిస్తుంది. సాధారణ గాయాలతో చికిత్స పొందుతున్న 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నాం. చికిత్స పొందుతున్న వారు గాయపడినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారిని దర్శించుకునే తిరిగి వెళతామని పట్టుదల వ్యక్తం చేశారు. అందుకే వారిని శుక్రవారం వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ అధికారులే తీసుకెళ్లి దర్శనం చేయించి స్వస్థలాలకు చేర్చేలా ఆదేశాలిచ్చాం’’ అని వివరించారు. తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నివేదిక వచ్చాక ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొంటామనీ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎప్పుడూ లేని సంప్రదాయాలు తెచ్చారు..
టీటీడీ గతంలో వైకుంఠ ఏకాదశికి, మరుసటి రోజైన వైకుంఠ ద్వాదశికి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా తిరుమలలోనే వారికి టోకెన్లు జారీ చేయడం జరిగేదన్నారు. అయితే గత నాలుగైదేళ్లలో ఎప్పుడూ లేని సంప్రదాయాలను అమల్లోకి తెచ్చారన్నారు. తిరుపతిలో టోకెన్లు జారీ చేయడం అందులో ఒకటన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలను పది రోజులపాటు కల్పించడం కూడా గతంలో లేదన్నారు. దానికి శాస్త్రాలు అంగీకరిస్తాయో లేదో తనకు తెలియదని, తానేమీ ఆగమ పండితుడిని కానన్నారు. వీటిపై ఆగమ పండితులతో చర్చించి టీటీడీ పాలకవర్గం, అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తిరుపతిలో జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ యంత్రాంగాలు నడుమ మరింత సమన్వయం పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ రెండు యంత్రాంగాలూ పరస్పర సమన్వయం, సహకారాలతో వ్యవహరించేలా చూస్తామన్నారు. అదే సమయంలో టీటీడీలో సైతం ఛైర్మన్, ఈవో, జేఈవోలు కలసి కట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. తాను సీఎం అయినప్పటికీ అన్నింటిలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. టీటీడీకి సంబంధించిన నిర్ణయాలన్నీ బోర్డులో చర్చ జరగాలని, ఏది మంచిదో సమీక్షించి వాటిని అమలు చేయాలని స్పష్టం చేశారు.
క్షతగాత్రులకు పరామర్శ
తిరుపతి స్విమ్స్ పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించారు. 42మంది గాయపడి ఆస్పత్రిలో చేరగా వారిలో 13మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 29మంది చికిత్స పొందుతుండగా ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి సీఎం పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల పరంగా ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఘటన జరిగిన తీరు గురించీ అడిగి తెలుసుకున్నారు. వారి వ్యక్తిగత వివరాలు సైతం ఆరా తీశారు.
2వేల మందిని కూడా కంట్రోల్ చేయలేరా?
తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరును సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ‘మీరు ఏం ముందస్తు చర్యలు తీసుకున్నారు?’ అంటూ టీటీడీ ఈవో శ్యామలరావును ప్రశ్నించారు. కిందిస్థాయి అధికారిని ఇంచార్జీగా నియమించి జాగ్రత్తలు చెప్పానని ఈవో చెప్పబోతుండగా...సీఎం వినిపించుకోలేదు. ‘మీరు కలెక్టర్ కదా...ఏం ఆదేశాలు ఇచ్చారు?’ అంటూ కలెక్టర్ వెంకటేశ్వర్‌ను నిలదీశారు. ‘ఏం తమాషా అనుకుంటున్నారా?’ అంటూ ఎస్పీ సుబ్బరాయుడుపై ఆగ్రహించారు. రెండు వేల మంది భక్తులను కూడా కంట్రోల్ చేయలేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ఎంతసేపటికి అంబులెన్స్ వాహనం వచ్చింది? వాహనం వున్నా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని అధికారులను సీఎం ప్రశ్నించారు. కౌంటర్లు ఏర్పాటుచేసిన రామానాయుడు మున్సిపల్ స్కూల్ ఆవరణంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ టీటీడీ జేఈవో గౌతమీపై మండిపడ్డారు. ఏటా జరిగేదే కదా...పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలుసు కదా...దానికి తగ్గట్టు ఎందుకు ముందస్తు ఏర్పాట్లు, చర్యలు తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదు? అంటూ ప్రశ్నించారు. ఘటన జరిగిన బైరాగిపట్టెడలోని పార్కు, స్కూల్లో కౌంటర్ల వద్ద అరగంటకు పైగా గడిపిన చంద్రబాబు తర్వాత స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి చేరుకున్నారు.
బైరాగిపట్టెడలో కేంద్రం పెట్టడమే తప్పు
తిరుపతిలోని బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కును, మున్సిపల్ స్కూలును టోకెన్ల జారీకి ఎంపిక చేయడమే పెద్ద తప్పని సీఎం అభిప్రాయపడ్డారు. వేల మంది భక్తులు వచ్చినపుడు వారిని పార్కు ఆవరణలో ఉంచి గేట్లకు తాళాలు వేయడం సరికాదన్నారు. శ్రీవారి దర్శన టోకెన్ల కోసం ఆత్రుతగా వేలాది మంది గంటల తరబడి వేచిచూస్తున్నపుడు వారిలో భయాందోళనలు ఉంటాయని వివరించారు. అలాంటప్పుడు ఏ చిన్న పాటి ఘటన జరిగినా తోపులాటకు, తొక్కిసలాటకు దారి తీస్తుందన్నారు. బైరాగిపట్టెడలో కూడా అదే జరిగిందని తెలిపారు. అస్వస్థతకు లోనైన మహిళను పార్కు నుంచి వెలుపలికి తీసుకెళ్లడానికి గేటు తాళం తీయాలని ఆమె భర్త ప్రాధేయపడితే అక్కడ విధుల్లో వున్న డీఎస్పీ అనాలోచితంగా వ్యవహరించారనీ, అందుబాటులో రెండు చిన్న గేట్లు ఉన్నప్పటికీ వాటిని తెరవలేదన్నారు. ముందు జాగ్రత్త లేకుండా ప్రధాన గేటు తెరవడంతో క్యూల్లోకి వదులుతున్నారని భావించిన భక్తులు పెద్దసంఖ్యలో గేటు వద్దకు తోసుకొచ్చారని, దానివల్లే తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగిందని చెప్పారు.