Share News

Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:32 AM

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

 Ram Mohan Naidu : బడ్జెట్‌పై బాబు ప్రభావం

  • సీఎం సూచనతోనే జల్‌జీవన్‌ గడువు పొడిగింపు

  • ఎంఎస్ఎంఈలకు కేంద్రం ప్రాధాన్యం

  • గురజాడ స్మరణ తెలుగువారికి గర్వకారణం

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు హర్షం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): గడిచిన ఏడు నెలలుగా రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల ప్రభావం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉందని పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గతంలో ప్రధాని మోదీకి జల్‌జీవన్‌ మిషన్‌ గడువును పొడిగించాలని సీఎం చంద్రబాబు చేసిన వినతి మేరకే, బడ్జెట్‌లో 2028 వరకు దానిని పొడిగించారని కేంద్ర మంత్రి తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలన్న కేంద్రప్రభుత్వ ఉద్దేశాన్ని గత వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. గత ఐదేళ్లలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద రాష్ట్రానికి రూ.15 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కృష్ణప్రసాద్‌, దగ్గుమళ్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీభరత్‌, జనసేన ఎంపీ ఉదయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయడు మాట్లాడుతూ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో ’దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులయ్‌’ అన్న తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను ప్రస్తావించడం తెలుగువారందరికీ గర్వకారణమని రామ్మోహన్‌నాయుడు అన్నారు.


మాన్యుఫాక్చరింగ్‌ రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, దీనివల్ల ఏపీకి అత్యధిక లాభం జరుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈకు కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేయడం వల్ల ఏపీకి అత్యధిక లాభం జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ పథకాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపులలో అత్యథిక భాగం రాష్ట్రానికి వచ్చేలా కూటమి ఎంపీలు అందరం కలిసి కృషి చేస్తామన్నారు. ఉడాన్‌ స్కీంను పదేళ్లు పొడిగిస్తూ కేంద్రబడ్జెట్‌లో ప్రస్తావించడంపై కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ ఉడాన్‌ స్కీంను పొడిగించారన్నారు. ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చాలన్న రాష్ట్రప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏవియేషన్‌, ఎయిర్‌కార్గో పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రస్తావించగా, మిగిలిపోయిన సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.


ఏపీకి వడ్డీ రహిత రుణాలు : లావు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు ఇవ్వబోతున్నట్లు బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం ప్రస్తావించిందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక ఎంట్రప్రెన్యూర్‌ రావాలన్న సీఎం చంద్రబాబు ఆశయానికి ఊతమిచ్చేలా ఎంఎ్‌సఎంఈలకు కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో.. సాకి కింద రాష్ట్రాలకు ప్రత్యేక సాయం కింద ఇచ్చే రుణ కేటాయింపులను రూ.లక్ష కోట్ల నుంచి రూ.1.50 లక్షల కోట్లకు కేంద్రప్రభుత్వం పెంచిందన్నారు. దీంతో ఏపీకి అత్యధిక మొత్తంలో వడ్డీరహిత రుణాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ రుణాలతో రాష్ట్రంలో మౌళిక సదుపాయాల కల్పన, పెన్నా-గోదావరి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులు సాకారమయ్యే అవకాశం ఉందన్నారు. గడిచిన ఏడు నెలల్లో అమరావతికి రూ.15 వేల కోట్లు, హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు వచ్చాయని, వచ్చే నాలుగు ఏళ్లలో కూడా అమరావతికి నిధులు వస్తాయని అన్నారు. బల్క్‌డ్రగ్‌ పరిశ్రమకు రూ.14 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, స్టీల్‌ప్లాంట్‌కు రూ.11 వేల కోట్లను కేంద్రం ప్రకటించిందని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రాష్ట్రంలోని ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు రుణాలను మంజూరు చేసేలా కేంద్రబడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట వేసిందని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయకృష్ణ తెలిపారు.

Updated Date - Feb 02 , 2025 | 04:55 AM