Cockfights : కో అంటే కోట్లు
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:14 AM
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.
తొలిరోజే రూ.300 కోట్ల పందేలు
గోదావరి సహా పలు జిల్లాల్లో కోడి పందేల జోరు
పందెం రాయుళ్ల హుషారు
కొందరికి బుల్లెట్ల కానుక
లక్షల సంఖ్యలో తరలివచ్చిన జనం
ఎటు చూసినా సంక్రాంతి ‘సంస్కృతి’
పులివెందులకూ పాకిన పందేలు
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ కోడి పందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల పండుగలో తొలిరోజే సుమారు రూ.300 కోట్ల మేరకు పందెం రాయుళ్లు పందేలొడ్డడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో వేసిన భారీ బరులను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పలు బరుల్లో పలువురు ప్రజాప్రతినిధులు సైతం సందడి చేశారు. కోడి పందేలను వీక్షించిన వారు కొందరైతే.. నేరుగా కోళ్లతో పందేలకు దిగిన వారు మరికొందరు! వెరసి భోగి వైభోగంగా జరిగిపోయింది!!
పశ్చిమలో 100 కోట్లు!
పశ్చిమగోదావరి జిల్లాలో రూ.కోట్లు చేతులు మారాయి. భీమవరం, ఉండి మండలాల్లో ఒక్కొక్క కోడి పందెం రూ.5 లక్షల వరకు వెళ్లింది. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ రోజే పందెం రాయుళ్లు రూ.100 కోట్ల వరకు పందేలు కాసినట్టు అంచనా. పెదఅమిరం, సీసలి, అయిభీమవరం, తాడేరు, కలగంపూడి, గొల్లవానితిప్ప, తాడేపల్లిగూడెంలో పెద్ద బరులను నిర్వహించారు. కలగంపూడిలో పోటీ పోటీగా బరులు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ముసుగు పందెం రూ.25 లక్షల వరకు పలికింది. ముసుగు పందెం అంటే ముందుగా కోళ్లను చూపించరు. పందెం ఖరారైన తర్వాత కోళ్లను బరిలోకి దింపుతారు. ఇక గుండాట, కోతముక్క ఆటలు జోరుగా సాగాయి. హాస్య నటుడు కృష్ణ భగవాన్ పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఊరూరా బరులు వెలిశాయి. పెద అమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు సంప్రదాయ ‘డింకీ పందేల’ను స్వయంగా ప్రారంభించారు.
ఉమ్మడి తూర్పులో
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పందేల జాతర ఘనంగా జరిగింది. తొలిరోజు కోడిపందాలు, గుండాట, కోతాటతో కలిపి రూ.175 కోట్లకుపైగా వ్యాపారం సాగినట్టు సమాచారం. బరులు ఏర్పాటు చేసిన చోట టెంట్లు వేశారు. విందు, వినోదాల మధ్య వీక్షకులు కేరింతలు కొట్టారు. బరుల్లో పందెం కోళ్లు కాళ్లు దువ్వాయి. భారీ టెంట్లు, షామియానాలు, మైక్‌లు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు, రన్నింగ్ కామెంటరీలు, పసందైన భోజనాలు పందెం రాయుళ్లను ఆకట్టుకున్నాయి. కోనసీమ జిల్లాలో 430 బరుల్లో పందేలు సాగాయి. కోడి పందేలు ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఏకంగా రూ.5 కోట్లు దాటినట్టు తెలిసింది. కాకినాడ జిల్లాలో 410, తూర్పుగోదావరి జిల్లాలో 300 బరులు ఏర్పాటు చేశారు. రంపచోడవరం ఏజెన్సీలో సైతం పెద్దసంఖ్యలో కోడి పందాలు, గుండాటలు జరిగాయి. బరుల వద్దే మద్యం అమ్మకాల జోరు కొనసాగింది.
పోలీసుల మాట ఇదీ!
రాష్ట్రంలో కోడి పందేలు, రూ.లక్షల్లో పేకాట నిర్వహిస్తున్న విషయంపై పోలీసులకు సమాచారం అందినా మౌనం పాటించారు. దీనిని బట్టి వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న విషయం స్పష్టమైందని పలువురు వ్యాఖ్యానించారు. అయితే.. గోదావరి జిల్లాల్లో 350 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెప్పాయి. 18 ప్రాంతాల్లో కోడి పందేల బరులు ధ్వంసం చేసినట్లు ఏలూరు రేంజ్ పోలీసులు చెబుతున్నారు. సోమవారం నాటికి 1800 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షించి కోళ్ల పందేల వేదికలు ధ్వంసం చేసినట్లు ఏలూరు రేంజ్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.
పందేలు-పదనిసలు!
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సతీశ్ తొమ్మిది పందేల్లో పాల్గొని ఆరు గెలిచి, బుల్లెట్‌ను సొంతం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాలు, పసిడి నాణేల ఆఫర్లు పందెం రాయుళ్లను ఆకట్టుకున్నాయి.
యలమంచిలి, వీరవాసరం మండలం నవుడూరులో విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
కాకినాడలోని కరప మండలంలో రూ.36 లక్షలతో బరి గెలుచుకున్న ఓ నిర్వాహుకుడు తొలిరోజు రూ.10 కోట్లకుపైగా పందేలు నిర్వహించారు.
కాకినాడరూరల్, కరప మండలాల్లో రూ.25 కోట్ల వరకు కోడిపందేలు, గుండాట వ్యాపారం జరిగింది.
బరుల వద్ద ఫైనాన్స్ వ్యాపారులు భారీగా మోహరించారు. తక్షణం అప్పులు ఇచ్చేందుకు వీలుగా నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు.
పిఠాపురం నియోజకవర్గంలో 60 చోట్ల పందేలు జరిగాయి. టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులు నిర్వహించారు.
ఏలూరు జిల్లాలో కోడి పందేల్లో పాల్గొన్న వారికి బిర్యానీ ఇచ్చేందుకు పాస్‌లు జారీ చేశారు.
కోడి పందేలను తిలకించేందుకు వచ్చిన మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలో ప్రజా ప్రతినిధుల ఫొటోలతోపాటు కోళ్లను వాటి యజమానులు ముద్దాడే ఫోటోలతో ‘మా సంక్రాంతి చాంపియన్’ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లాలో క్యాసినోను రహస్యంగా నిర్వహించారు. క్యాసినో కింగ్‌గా పేరున్న చీకోటి ప్రవీణ్ అనుచరులు ఈ శిబిరాలను నిర్వహించినట్టు సమాచారం.
ఫ్లడ్ లైట్ల వెలుగులో రేయింబవళ్లు జరిగే పందేలను ప్రత్యేక డ్రోన్లు, అత్యాధునిక సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అతిథులు, బెట్టింగ్ రాయుళ్లు, కోళ్లు తెచ్చిన వారికి స్థాయిని బట్టి అతిథి మర్యాదల్లో కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు.
పులివెందులలో తొలిసారి
కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలి రోజే రూ.2 కోట్లు దాటినట్లు సమాచారం. పలువురు టీడీపీ నాయకులు వీటి నిర్వహణకు మక్కువ చూపారు. మొత్తంగా పులివెందులలో ఎనిమిది చోట్ల భారీగా కోడిపందేలు నిర్వహించారు. పార్టీలకతీతంగా వీటిలో పాల్గొనడం మరో విశేషం. లింగాల మండలం దొండ్లవాగులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల మేర పందేలు జరిగినట్లు తెలిసింది. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి బరుల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు తెలిసింది.
ప్రకాశం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కోడి పందేలు హుషారుగా సాగాయి. కలెక్టర్, ఎస్పీ హెచ్చరికలు చేసినప్పటికీ ఎవరి పని వారిదే అన్నట్లుగా నిర్వాహకులు వ్యవహరించారు. సంతనూతలపాడు చిన్న చెరువులో భారీ బరి ఏర్పాటు చేసి 200 కోళ్లతో పందేలు వేశారు. ఇక్కడ పై పందేలే రూ.లక్షలో జరిగినట్లు తెలిసింది.
ఏలూరు జిల్లాలో కోడి పందేలు ధూమ్‌ధామ్‌గా ప్రారంభమయ్యాయి. 7 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. పేకాట జోరుగా సాగింది. గుండాటకు జనం ఎగబడ్డారు. ఒక్కొక్క పందెం రూ.ఐదు వేల నుంచి రూ.మూడున్నర లక్షల వరకు సాగింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడిపందేలు విచ్చలవిడిగా సాగాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలతోపాటు విజయవాడ నగరంలోను బరులు ఏర్పాటు చేశారు. పటమటలంక, కబేళా ప్రాంతాల్లో ఈ ఏడాది తొలిసారి బరులు ఏర్పాటు కావడం గమనార్హం. జక్కంపూడిలోని పాములకాల్వ వద్ద టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బరిని ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో అతిపెద్ద బరిగా ఉన్న అంపాపురంలో రూ.10 కోట్లకు పైబడి పందేలు సాగాయి. ఇక్కడ పందేలను బట్టి బరులు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలు ఆ పైబడిన పందేల కోసం రెండు పెద్దబరులను ఏర్పాటు చేశారు. తర్వాత రూ. లక్ష నుంచి రూ.5 లక్షల పందేల కోసం ఐదు చిన్నబరులను ఏర్పాటు చేశారు.
బాపట్ల జిల్లాలో సోమవారం ఒక్క రోజే కోడి పందేలు, పేకాట రూపంలో రూ.5 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. చెరుకుపల్లి మండల పరిధిలోని తూర్పుపాలెం బరిలో కోడి పందేలను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వీక్షించారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు తూర్పుపాలెం బరి వద్దకు వచ్చారు.
బాపట్ల బరుల్లో ప్రవేశం కోసం టోకెన్ల జారీ చేపట్టి అనుమతి లేకుండా పేకాట శిబిరాల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా చేశారు. పేకాటకు ఒక్కో గేమ్‌కు రూ.5 లక్షల చొప్పున పెట్టి ఆడగా, కోడి పందేల విషయంలో లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు పందేలు పెట్టారు.