Share News

Nara Lokesh : నేటి నుంచి జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:51 AM

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో శనివారం నుంచి ప్రారంభం కానుంది.

Nara Lokesh : నేటి నుంచి జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

  • 475 కాలేజీల్లో 1.48 లక్షల విద్యార్థులకు అమలు

  • విజయవాడలో ప్రారంభించనున్న మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీల్లో శనివారం నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివే 1.48 లక్షలమంది ఈ పథకం వల్ల నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా.. 398 కాలేజీలను సమీపంలోని పాఠశాలలకు అనుసంధానం చేశారు. ఆ పాఠశాలల్లో భోజనం తయారుచేసి కాలేజీలకు పంపుతారు. మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లకు అనుసంధానించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి రూ.27.39కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో రూ.85.84కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. వైసీపీ ప్రభుత్వం దానిని రద్దుచేసింది. ఆ నిర్ణయం పేద విద్యార్థులపై ప్రభావం చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్‌ విద్యలో సంస్కరణలు ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్యను పెంచడం లక్ష్యంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసింది. మధ్యాహ్న భోజన పథకం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించింది. దీంతో ఈ పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్లు అందించాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jan 04 , 2025 | 04:51 AM