East Godavari: రహస్య ప్రాంతంలో కోడి పందేలు.. ఎంటరైన పోలీసులు.. చివరికి..
ABN , Publish Date - Feb 20 , 2025 | 08:17 AM
తూ.గో.జిల్లా నల్లజర్ల మండలం ముసుళ్లగుంటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న జూదగాళ్లు నిత్యం కోడి పందేలు ఆడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అక్కడికి చేరుకుని లక్షల రూపాయలు పందేలు వేస్తున్నారు.

తూ.గో.జిల్లా: సంక్రాంతి వెళ్లిపోయి నెల రోజులు గడుస్తున్నా పందెం రాయుళ్లు మాత్రం తగ్గడం లేదు. పోలీసుల కళ్లుగప్పి నిత్యం కోడి పందేలు ఆడుతూనే ఉన్నారు. రహస్య ప్రాంతాల్లో పేకాట, కోడి పందెం వంటి జూదాలు ఆడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. జూదం వ్యసనంతో ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్డుమీదకు తీసుకురావొద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా "తగ్గేదే లే" అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నా వారిలో మాత్రం భయం కలగడం లేదు. నిత్యం జూదం ఆడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. అలాంటి వారిపై ఖాకీలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా అలాంటి ఘటన ఒకటి తూ.గో.జిల్లాలో చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం ముసుళ్లగుంటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న జూదగాళ్లు నిత్యం కోడి పందేలు ఆడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున అక్కడికి చేరుకుని లక్షల రూపాయలు పందేలు వేస్తున్నారు. కుటుంబసభ్యులు వెళ్లి పిలుస్తున్నా ఇంటికి వెళ్లడం లేదు. అయితే వారి తీరుపై ఆగ్రహించిన కొంతమంది స్థానికులు సమాచారాన్ని నలజర్ల పోలీసులకు అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు కోడి పందేల స్థావరంపై దాడి చేశారు. పందేలు కాస్తున్న 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.6.02 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఏడు కార్లు, ద్విచక్రవాహనం, 29 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్ చెప్పిన బులియన్ మార్కెట్.. బంగారం, వెండి ధరలు ఇవే..
Corruption : రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా!