West Godavari : పత్తి తూకంలో మోసం.. వ్యాపారికి దేహశుద్ధి
ABN , Publish Date - Jan 07 , 2025 | 07:07 AM
తూకంలో మోసం చేస్తున్న పత్తి వ్యాపారికి రైతులు దేహశుద్ధి చేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో సోమవారం జరిగింది.
చాట్రాయి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తూకంలో మోసం చేస్తున్న పత్తి వ్యాపారికి రైతులు దేహశుద్ధి చేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో సోమవారం జరిగింది. తెలంగాణకు చెందిన ముగ్గురు పత్తి వ్యాపారులు పర్వతాపురంలో చొప్పరపు బజారుకు వచ్చారు. రైతుల వద్ద వున్న పత్తిని కొనుగోలు చేసి, వారి వెంట తెచ్చిన ఎలకా్ట్రనిక్ వేయింగ్ మిషన్‌తో కాటా వేస్తున్నారు. వ్యాపారుల్లో ఒకరు తన వద్ద ఉన్న రిమోట్‌తో ఎవరికి అనుమానం రాకుండా ఎలకా్ట్రనిక్ వేయింగ్ మిషన్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు ఓ యువకుడు గమనించి రైతులకు చెప్పాడు. వెంటనే రైతులు వేరే వేయింగ్ మిషన్ తెచ్చి కాటా వేయగా వ్యాపారి 80 కిలోలు చెప్పిన బోరెం 125 కిలోలు ఉంది. దీనికి ఆగ్రహం చెందిన రైతులు ఒక వ్యాపారిని పట్టుకొని దేహశుద్ధి చేస్తుండగా మరో ఇద్దరు వ్యాపారులు పరారయ్యారు. తర్వాత వ్యాపారి తప్పు జరిగింది క్షమించమని వేడుకోవటంతో రూ.20 వేలు జరిమానా వసూలు చేసి వదిలేశారు.