EX Kerala Education Minister MA Baby : ప్రమాదంలో దేశ విద్యావ్యవస్థ
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:06 AM
ప్రస్తుతం దేశంలో విద్యావిధానం బలహీనపడుతోందని.. కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణతో ప్రమాదంలో పడిందని కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి ఎంఏ బేబి అన్నారు.
కాషాయీకరణ, కార్పొరేటీకరణే కారణం: కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబి
యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభకు అతిథిగా హాజరు
కాకినాడ కలెక్టరేట్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం దేశంలో విద్యావిధానం బలహీనపడుతోందని.. కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణతో ప్రమాదంలో పడిందని కేరళ మాజీ విద్యాశాఖ మంత్రి ఎంఏ బేబి అన్నారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో రెండో రోజు సోమవారం జరిగిన విద్యాసదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం విద్యా విధానాన్ని ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. విద్య విషయంలో కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం నాణ్యమైన విద్య అందించడమేనన్నారు. మాతృభాషలో విద్య బోధించడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ విద్యావేత్త వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 2023లో విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఆయా దేశాలకు చెల్లించిన ఫీజులు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు అని, వీటిలో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు రూ.42 వేల కోట్లు చెల్లించారని తెలిపారు. ఇక్కడి విద్యావ్యవస్థలో అన్ని సౌకర్యాలు ఉంటే మన విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదన్నారు. కేరళ, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో విద్యావిధానం అద్భుతంగా ఉందని, ఈ రాష్ర్టాల్లో 70-80 శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారన్నారు. యూటీఎఫ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తమిళనాడు మదురై విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజ్‌మాణిక్యం మాట్లాడుతూ జాతీయ నూతన విద్యావిధానం విద్యావ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందని, విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తుందన్నారు.
ఉపాధ్యాయుల ర్యాలీతో ఎరుపెక్కిన కాకినాడ
వేలాది మంది ఉపాధ్యాయులు సోమవారం మధ్యాహ్నం యూటీఎఫ్ ఎర్రజెండాను పట్టుకుని కాకినాడలో భారీ ర్యాలీ చేశారు. దీంతో కాకినాడ నగరం ఎరుపెక్కింది. 117 జీవో, సీపీఎస్ రద్దు చేయాలని, ఓపీఎ్‌సను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరెండర్ లీవులు, పీఆర్సీ సెలవుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్ కళాశాల నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు సురే్‌షకుమార్, ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్, యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నగేష్, చక్రవర్తి పాల్గొన్నారు.