Share News

TDP Leader Lavu Sri Krishna devaraya: కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తిని పంపారు

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:16 AM

మాజీ మంత్రి విడదల రజనీపై అనేక ఆరోపణలు, కేసు వెనక్కి తీసుకోవడానికే వాహనంగా ఉపయోగించుకున్నట్లు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. రజనీ గతంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ కంపెనీకి డబ్బులు తీసుకుని వ్యవహారాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు

 TDP Leader Lavu Sri Krishna devaraya: కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తిని పంపారు

  • తప్పుల మీద తప్పులు చేసి ‘రెడ్‌బుక్‌’ అంటే ఎలా?

  • విడదల రజనీపై నరసరావుపేట ఎంపీ లావు ధ్వజం

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి విడదల రజనీ తనపై నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని 10 రోజుల క్రితం ఒక మధ్యవర్తిని నా దగ్గరకు పంపారు’’ అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్స్‌ వాళ్లకు డబ్బులు తిరిగిస్తామని, గుంటూరుకు చెందిన కౌన్సిలర్‌ దుర్గారావు వద్ద ఆ సొమ్ము ఉంచుతామని, కేసు వెనక్కి తీసుకోవాలని మధ్యవర్తితో చెప్పించారని తెలిపారు. ‘‘తప్పుల మీద తప్పులు చేసిన రజనీ ‘రెడ్‌బుక్‌’ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు చేస్తే ఎలా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో లావు మీడియాతో మాట్లాడారు. తప్పు చేయనప్పుడు తన వద్దకు మనిషిని ఎందుకు పంపారని రజనీని ప్రశ్నించారు. కాల్‌డేటా ఆరోపణలపై స్పందించిన ఆయన.. తన ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారని, బయటివాళ్లను ఒకలా, ఇంట్లో వాళ్లను మరోలా భావించే వ్యక్తిని కాదన్నారు. ఆమెపై నమోదైన కేసును పక్కదారి పట్టించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్స్‌ యాజమాన్యానికి, తనకు బంధుత్వం లేదని చెప్పారు. వ్యాపార లావాదేవీలు కూడా లేవన్నారు. 2021లో లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్స్‌లో చాలా అక్రమాలు జరుగుతున్నాయని రజనీ ఫిర్యాదు చేశారని, ఐపీఎస్‌ అధికారి జాషువా చర్యలు తీసుకోకపోవడంతో జగన్‌ మీడియా రిపోర్టర్‌ను తీసుకుని నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఒత్తిడి తెచ్చారని తెలిపారు.


జాషువా గనుల శాఖకు సమాచారం ఇచ్చారని, ఆ విభాగం క్రషర్‌ యజమానిపై భారీ ఫైన్‌ విధించిందన్నారు. దీనిని అడ్డం పెట్టుకుని క్రషర్‌ సంస్థ కప్పం కడితే వదిలేస్తానని రజనీ డబ్బులు తీసుకున్నారని ఎంపీ వివరించారు. వేధింపులు ఎదుర్కొన్న క్రషర్స్‌ సంస్థ కేసు పెడితే తనపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చాలా మంది దగ్గర రజనీ డబ్బులు తీసుకుని ఎగవేశారని, అడిగితే బెదిరించారని ఆరోపించారు. వీరిలో పోతారం భాషా, ఎంపీపీ శంకర్‌రావు, ముత్తా వాసు, గోల్డ్‌ శ్రీను, మున్నంగి, అబ్బాస్‌ ఖాన్‌, నాగయ్య వంటి చాలా మంది ఉన్నారని తెలిపారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:25 AM