Vijayawada : పోలీసు కస్టడీకి వంశీ
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:23 AM
వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

విజయవాడ కోర్టు 3 రోజుల అనుమతి
నేడు కస్టడీకి తీసుకోనున్న పోలీసులు
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ
మరో ముగ్గురు నిందితుల అరెస్ట్
విజయవాడ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి, కేసు నుంచి తప్పుకొనేలా చేశారన్న ఆరోపణలతో వంశీతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, వంశీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన వస్తువుల గురించి ఆయనను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయాధికారి హిమబిందు సోమవారం తీర్పును వెలువరించారు. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలని తీర్పులో స్పష్టం చేశారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి తీసుకెళ్లేటప్పుడు, తిరిగి జైలుకు తీసుకొచ్చేటప్పుడు ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. విచారణ సమయంలో మూడు నుంచి నాలుగు సార్లు ఐదు నుంచి పది నిమిషాల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. సీసీ కెమెరాల చిత్రీకరణ మధ్య విచారణ సాగాలని తీర్పులో పేర్కొన్నారు. వంశీని ఎక్కడ విచారిస్తారో ఆయన తరఫు న్యాయవాదులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. పోలీసులు మంగళవారం ఉదయం వంశీని కస్టడీకి తీసుకుంటారు.
సీఐడీ పీటీ వారెంట్
వల్లభనేని వంశీపై సీఐడీ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీ తనను పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని హైకోర్టు కొద్దిరోజుల క్రితం తిరస్కరించింది. దీంతో సీఐడీ అధికారులు మూడో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పీటీ వారెంట్ దాఖలు చేశారు.
మరో ముగ్గురి అరెస్టు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏ27గా ఉన్న శివకుమార్, ఏ28గా ఉన్న ఆదిలక్ష్మి, ఏ54గా ఉన్న ప్రవీణ్‌ను సోమవారం అరెస్టు చేసి విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి తిరుమలరావు రిమాండ్ విధించారు. అనంతరం వారిని నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
జైలులో వంశీకి వసతులు
విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీకి నిద్రించడానికి మంచం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెస్ట్రన్ కమోడ్ ఉన్న బాత్‌రూం కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇంటి నుంచి భోజనం, ఫర్నీచర్ సమకూర్చుకునేందుకు నిరాకరించింది. తనకు వెన్ను నొప్పి ఉన్నందున వసతులు కల్పించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయాధికారి హిమబిందు కొద్దిరోజుల క్రితం జైలు అధికారులను విచారించారు. జైలులో ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. దీనిపై సోమవారం ఆమె ఆదేశాలు జారీ చేశారు.