Share News

POCSO Case : బెజవాడ పోలీసుల విచారణకు గోరంట్ల మాధవ్‌ డుమ్మా

ABN , Publish Date - Mar 06 , 2025 | 04:24 AM

విజయవాడ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావలసిన హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌ డుమ్మాకొట్టారు.

POCSO Case : బెజవాడ పోలీసుల విచారణకు గోరంట్ల మాధవ్‌ డుమ్మా

  • నేడు వస్తానని ఫోన్‌చేసి వెల్లడి

  • వైసీపీ నేతలు, కార్యకర్తలతో అనంతలో భారీ బలప్రదర్శన

  • 50కి పైగా వాహనాలతో ర్యాలీ

  • విజయవాడ బయల్దేరగానే అడ్డుకున్న పోలీసులు

  • 3 వాహనాలు ఉంచి మిగతావి వెనక్కి

అనంతపురం/విజయవాడ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసు బాధితుల వివరాలను బయట పెట్టినందుకు నమోదైన కేసులో విజయవాడ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట బుధవారం హాజరు కావలసిన హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌ డుమ్మాకొట్టారు. పైగా అనంతపురంలో హైడ్రామాకు తెరలేపారు. మందీమార్బలంతో బలప్రదర్శన చేపట్టారు. విజయవాడ వెళ్తున్నానని, పోలీసుల ప్రతి ప్రశ్నకు జవాబిస్తానని ప్రకటించి.. చివరకు విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం వస్తానని వారికి సమాచారం ఇచ్చారు. బుధవారం విచారణ నిమిత్తం విజయవాడ రావాలని కొద్దిరోజుల కిందట విజయవాడ పోలీసులు ఆయనకు 41ఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. బెజవాడ వెళ్తున్నట్లు బుధవారం ఆయన భారీ బిల్డప్‌ ఇచ్చారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అనంతపురంలోని మాధవ్‌ ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా వారిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 50కిపైగా వాహనాల భారీ కాన్వాయ్‌తో మాధవ్‌ నగరంలో బలప్రదర్శన చేశారు. వైఎస్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాన్వాయ్‌తో నగరశివారులోని జాతీయ రహదారిపైకి చేరుకోగానే.. పోలీసులు అడ్డుకున్నారు. 3 వాహనాలు తప్ప.. మిగిలినవన్నీ వెనక్కిపంపారు. తర్వాత మాధవ్‌ విజయవాడ దిశగా బయల్దేరారు. అయితే కొద్దిసేపటికి బెజవాడ సైబర్‌ క్రైం పోలీసులకు ఫోన్‌ చేశారు. తాను వేరే ఊరి నుంచి అనంతపురం వచ్చానని.. ఈ రోజు రావాలంటారా అని అడిగారు. వస్తే విచారణ పూర్తవుతుంది కదా అని పోలీసులు బదులిచ్చారు. ఇవాళ రాలేనని.. గురువారం ఉదయం హాజరవుతానని ఆయన చెప్పారు. వారు అందుకు అంగీకరించారు.


అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు విచారణకు హాజరవుతానని.. తనకు వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో.. గురువారం వస్తానని చెప్పానని తెలిపారు. ‘బలప్రదర్శనతో వెళ్తున్నారా..? విజయవాడకు వెళ్లేందుకు ఒకట్రెండు రోజులు పడుతుందా..’ అని మీడియా ప్రశ్నించగా... తాను విచారణకు వెళ్తున్నాననే సమాచారంతో సంఘీభావం తెలుపడానికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారని బదులిచ్చారు. విజయవాడ పోలీసులు తనకు నోటీసులు అందజేసిన రోజు ‘అంతర్యుద్ధం వస్తుంది’ అని తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

Updated Date - Mar 06 , 2025 | 04:25 AM