Dhulipalla: అంబటి మురళిపై మరోసారి పైర్ అయిన ధూళిపాళ్ల
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:45 PM
Andhrapradesh: గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్ కోసం రైల్వే అనుమతి కోసం బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా తరపున 2023 జులైలో లేఖ రాశారని.. కానీ రైల్వే శాఖ ఎన్వోసీ ఇవ్వటం సాధ్యం కాదని వారు సమాధానం ఇచ్చారని ధూళిపాళ్ల తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి 15 అంతస్తులు కట్టడంతో 2023 మే20న రైల్వే శాఖ ఎన్వోసీ రద్దు చేసిందన్నారు.
గుంటూరు జిల్లా, జనవరి 6: వైసీపీ నేత అంబటి మురళిపై (YSRCP Leader Ambati Murali) పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (MLA Dhulipalla Narendra) మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అంబటి మురళి అక్రమ నిర్మాణాలను గతంలోనే వెలుగులోకి తెచ్చానని... ఇప్పుడు వినియోగదారులను మోసపుచ్చేలా అంబటి మురళి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయని వినియోగదారులను మభ్యపెడుతున్నారన్నారు. తన మార్కెటింగ్ సిబ్బంది ద్వారా ఫోన్ కాల్స్ చేయిస్తున్నారని.. కేవలం నాలుగు అంతస్తుల వరకు మాత్రమే రైల్వే ఎన్వోసీ ఇచ్చిందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి 15 అంతస్తులు కట్టడంతో 2023 మే20న రైల్వే శాఖ ఎన్వోసీ రద్దు చేసిందన్నారు. ఈ లేఖను మున్సిపల్ అధికారులకు పంపించినా వైసీపీ పాలక వర్గం పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం ఉపయోగించుకుని కార్పోరేషన్ రికార్డుల నుంచి రైల్వే ఎన్వోసీ రద్దు లేఖను తొలగించారన్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్ కోసం రైల్వే అనుమతి కోసం బజరంగ్ అర్బన్ ఇన్ ఫ్రా తరపున 2023 జులైలో లేఖ రాశారని.. కానీ రైల్వే శాఖ ఎన్వోసీ ఇవ్వటం సాధ్యం కాదని వారు సమాధానం ఇచ్చారని తెలిపారు.
కానీ ఇప్పుడు అంబటి మురళి తనపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 నవంబర్ 2న ఏలూరు జ్యూట్ మిల్లు నుంచి అంబటి మురళి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నారన్నారు. రైల్వే ఎన్వోసీ రద్దు తర్వాత ఈ తరహా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్వోసీ లేకుండానే పనులు జరిపారని ఆరోపించారు. అంబటి మురళి ఇటీవల రైల్వే వారిపై కేసు వేయించారని.. ఆ పిటిషన్‌లోనే మురళి కృష్ణ ఈ డాక్యుమెంట్లు జత చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండగానే ఎన్వోసీ రద్దు అయితే టీడీపీ ప్రభుత్వంపై ఏడుపు ఎందుకని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్
Loyola College Walkers: మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే
Read Latest AP News And Telugu news