Share News

YSRCP: జగన్ మోసాలు.. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం..

ABN , Publish Date - Feb 25 , 2025 | 09:10 AM

ప్రతిపక్షనేత హోదా దక్కదని తెలిసినా జగన్ తన వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదు. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైసీపీ నేతలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడంలేదు. రాదని తెలిసినా ప్రతిపక్షహోదా నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారా.

YSRCP: జగన్ మోసాలు.. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం..
YS Jagan

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గవర్నర్ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. మొదటి రోజు శాసనసభ సమావేశాలకు వస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించడంతో మొత్తానికి మొండిపట్టు వీడి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షం శాసనసభకు వస్తుందని అంతా భావించారు. కానీ కొద్దిసేపటికే అందరి ఆశలు, అంచనాలను వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి నీరుగార్చారు. కొద్దినిమిషాలు సభలో ఉండి.. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలాలనే దురుద్దేశంతోనే సభకు వచ్చారనే విషయం ప్రజలకు అర్థమైంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వాస్తవానికి ప్రజస్వామ్యాన్ని గౌవరించకుండా, ప్రజల నిర్ణయానికి భిన్నంగా తమకు ప్రతిపక్షహోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన మోసపూరిత బుద్ధిని వదులుకోలేకపోతున్నారని కొందరు విమర్శిస్తున్నారు.


రాదని తెలిసినా..

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన వైఖరి తెలియజేస్తోంది. సమావేశాలకు హాజరుకాబోమని నేరుగా ప్రకటిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో.. ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ప్రశ్నించేందుకు ఎక్కువ సమయం కావాలని, ప్రతిపక్ష నేత హోదా ఉంటే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం వస్తుందనే ప్రచారంతో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి శాసనసభలోని మొత్తం సభ్యులలో పది శాతం సీట్లను సాధించిన పార్టీకి ప్రతిపక్షహోదా దక్కుతుంది. ప్రతిపక్షహోదా దక్కాలంటే ఎన్నిసీట్లు ఉండాలనే ప్రత్యేక నిబంధన లేకపోయినప్పటికీ ఇదొక సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ఐదేళ్లూ సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడమే లక్ష్యంగా జగన్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లూ సీఎంగా ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేస్తూ వచ్చిన జగన్, అధికారం కోల్పోయిన తర్వాత తన సహజసిద్ధమైన స్వభావాన్ని వదులుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదనేది సుస్పష్టం. ఈక్రమంలో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ వైసీపీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజానిర్ణయాన్ని అగౌరవపరుస్తుందనే వాదన వినిపిస్తోంది.


ప్రయత్నం చేయకుండానే..

వాస్తవానికి శాసనసభ, శాసనమండలిలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఆయా పార్టీలకు మాట్లాడే అవకాశం లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో సభ్యులు రిక్వెస్ట్ చేస్తే తగినంత సమయం కేటాయించే విచక్షణాధికారం స్పీకర్‌కు ఉంటుంది. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించేందుకు సభ్యులు ప్రయత్నం చేయవచ్చు. సమస్య తీవ్రత ఆధారంగా స్పీకర్ సభ్యుడికి ఎంత సమయం కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు. ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ సభలో మాట్లాడేందుకు తగిన సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు సభకు వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయకుండానే, తమకు హోదా ఇవ్వకపోతే తాము సభకు వెళ్లబోమంటూ భీష్మించుకుని కూర్చోవడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకుంటారా.. లేదంటే ప్రజలను మోసం చేసే ధోరణితోనే ముందుకెళ్తారా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 25 , 2025 | 09:10 AM