Health Minister Sathya Kumar : పేదలకు ఆరోగ్య ధీమా
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:04 AM
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన సేవలు అందించేలా దానిని రూపొందించామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
1.43 కోట్ల కుటుంబాలకు రక్ష
ప్రతి కుటుంబానికీ 25 లక్షల ఆరోగ్య భరోసా
మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం
ఏప్రిల్ 1నుంచి హైబ్రిడ్ పద్ధతిలో ఆరోగ్య బీమా
వివరాలు వెల్లడించిన మంత్రి సత్యకుమార్
ఇకపై రూ.2.5 లక్షల లోపు వైద్య క్లెయిమ్‌లు బీమా కంపెనీల పరిధిలోకి
పేదల ప్రీమియం మొత్తం కట్టనున్న ప్రభుత్వం
ఆపై, రూ.25 లక్షల వరకు భరించనున్న ఎన్టీఆర్ వైద్యసేవల ట్రస్ట్
ఆరు గంటల్లోనే ప్రీ-ఆథరైజేషన్‌కు అనుమతి
వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ముంచేసింది
మాకు వారసత్వంగా రూ.2,225 కోట్ల బకాయిలు సంక్రమించాయి: మంత్రి
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన సేవలు అందించేలా దానిని రూపొందించామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలు చేస్తామని చెప్పారు. దీని వల్ల 1.43 కోట్ల కుటుంబాల్లోని 4.30 కోట్ల మంది పేదలకు ఉచితంగా రూ.25 లక్షలు విలువైన వైద్యసాయం అందుతుందని చెప్పారు. నిజానికి, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి పార్టీల నేతల హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆ హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం బీమా కంపెనీలు, నెట్‌వర్క్ ఆస్పత్రులతో చర్చించి.. మెరుగైన వైద్య విధానాల పరిశీలనకు దాదాపు పది రాష్ట్రాల్లో పర్యటించి.. చివరకు హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానం వివరాలను సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వెల్లడించారు. బీమా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ పథకం హైబ్రిడ్ విధానంలో అనుసంధానం అవుతాయని మంత్రి తెలిపారు.
ఎన్టీఆర్ వైద్య సేవ (పూర్వం ఆరోగ్యశ్రీ) పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. హెబ్రిడ్ విధానంలో బీమా కంపెనీలను ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమంలో భాగం చేసి, పథకం పనితీరును మెరుగుపరచనున్నట్టు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి, ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూర్చడమే హైబ్రిడ్ విధానం లక్ష్యమన్నారు.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు
హైబ్రిడ్ విధానం ప్రవేశపెట్టడం వల్ల రూ.2.5 లక్షలలోపు ఇకపై ఉచిత వైద్యసేవలు అందబోవనీ, బీమా కంపెనీల రాకతో పేదలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అలాగే, వైద్యసేవలను ట్రస్ట్ మోడల్ నుంచి బీమా మోడ్‌లోకి మారుస్తున్నట్లు జరుగుతుందన్న వదంతుల్లో కూడా నిజం లేదని చెప్పారు. ఈ విధానంలో పేదలు ఒక్క పైసా కూడా అదనంగా చెల్లించనక్కర్లేదని, వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే కడుతుందని మంత్రి వివరించారు. పేదలకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనం యథాతథంగా అందుతుందని చెప్పారు.
అందుకే.. హైబ్రిడ్‌లోకి..
దాదాపు 10 రాష్ట్రాలోని ఉత్తమ వైద్య విధానాలను పరిశీలించిన తర్వాతనే హైబ్రిడ్ పద్ధతిలో వైద్య సేవలు అందించాలని నిర్ణయించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘వైద్య సేవల్లో 90 శాతం క్లెయిమ్‌లు రూ.2.5 లక్షల లోపే ఉంటున్నాయి. వాటిని బీమా సంస్థలు భరిస్తాయి. ఇందుకోసం 1.43 కోట్ల కుటుంబాలకు ముందుగానే ప్రీమియం చెల్లించి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఆపై....రూ.25లక్షలవరకూ క్లెయిమ్‌లను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లిస్తుంది. ఇప్పటివరకూ వైద్య సేవలు అందించిన తర్వాతే ఆస్పత్రులకు బిల్లలు చెల్లిస్తున్నారు. ముందుగానే బీమా ప్రీమియం చెల్లించడం వల్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటాయనే భయం నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఉండదు.ప్రీ-ఆథరైజేషన్ కోసం 24 గంటలు పట్టేది. దీనిని ఆరు గంటలకు కుందించేలా బీమా కంపెనీలతో మాట్లాడాం’’ అని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
వారసత్వంగా రూ.2,225 కోట్ల బకాయిలు..
ఆరోగ్యశ్రీలో రూ.2,225 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం తమకు వారసత్వంగా వదిలి వెళ్లిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ‘‘గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన ఆసుపత్రులకు ఐదేళ్లలో రూ.16 కోట్ల జరిమానా వేసి కనీసం 1 శాతం రికవరీ కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆస్పత్రులపై రూ.22.70 కోట్ల జరిమానాలు విధించాం. వాటిని నోటీసులు కూడా జారీ చేశాం. ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4 వేల కోట్లు కేటాయించాం. మాకు చిత్తశుద్ధి లేకపోతే ఈ కేటాయింపులు ఎలా జరుగుతాయి?’’ అని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లలో రూ.9,942 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఏడాదికి రూ.1,988 కోట్లు మాత్రమే ఖర్చు చూపించిందని వివరించారు. ఆ బకాయిల్లో కూటమి ప్రభుత్వం రూ.1,350 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.