Land Encroachment : 80 కోట్ల ఆస్తిపై గద్దల కన్ను
ABN , Publish Date - Jan 08 , 2025 | 06:16 AM
నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది.
12 ఏళ్ల క్రితమే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
నాడే నిషేధిత జాబితాలో చేర్చిన రెవెన్యూశాఖ
ఏడాది క్రితం అనూహ్యంగా ఆ జాబితా నుంచి తొలగింపు
బేరసారాలు పూర్తి.. రిజిస్ట్రేషన్‌కు సర్వం సిద్ధం
(కందుకూరు-ఆంధ్రజ్యోతి)
నెల్లూరు జిల్లా కందుకూరు నడిబొడ్డున సుమారు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై అక్రమార్కులు కన్నేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి అది. అందులోని భవనాలను కూడా సీజ్ చేసి, 22ఏ జాబితాలో చేర్చారు. ఆ ఆస్తిని 22ఏ జాబితా నుంచి తొలగించడం, అక్రమార్కులు ఆ భూమిని అమ్మగా, కారుచౌకగా వస్తోందని కొందరు పెద్దలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కు అన్నీ సిద్ధం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్తిపై అవగాహన ఉన్న స్థానిక రిజిస్ట్రేషన్ అధికారులు తటపటాయించటంతో ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. కందుకూరులోని కనిగిరి రోడ్డులో కోర్టు భవనాల ఎదురుగా ఉన్న 8.70 ఎకరాల ఫాదర్ బంగ్లా వ్యవహారం ఇది. బ్రిటిష్ హయాంలో సేవా కార్యక్రమాలు, క్రైస్తవ మతప్రచారం కోసం డబ్ల్యూబీ బాగస్ దొర సర్వే నెం.232లో కొంత భూమి కొనుగోలు చేసి బంగ్లా నిర్మించారు. ఇదే ఫాదర్ బంగ్లాగా ప్రాచుర్యం పొందింది. సర్వేనెం.232లో 9.14 ఎకరాలు ఉండగా, ఆర్‌ఎ్‌సఆర్, రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ ప్రకారం ఆ ఆస్తి డబ్ల్యూబీ బాగస్, పోరూరి జనార్థనయ్యలకు చెందినది.స్వాతంత్ర్యానంతరం బాగస్ దొర దేశం విడిచి వెళ్లిపోగా కొందరు ప్రైవేటు వ్యక్తులు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ ఈ బంగ్లాలోకి ప్రవేశించి .....మెర్సీ పేరుతో ఓ ఉన్నత పాఠశాలను స్థాపించారు. 1980లో 9.14 ఎకరాలలో 44 సెంట్ల భూమిని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు దారికోసం ప్రభుత్వం తీసుకుంది. కాగా, పోరూరి జనార్థనయ్య వారసులు అందులో సగం తమకు చెందుతుందని కోర్టును ఆశ్రయించారు.
మిగిలిన సగం వాటాదారుడైన బాగస్ దేశం విడిచి వెళ్లినందున ఆ ఆస్తి ప్రభుత్వానిదేనన్నవాదన వచ్చింది. దీంతో అందులో పాఠశాల నడుపుతున్న ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వానికి మధ్య దశాబ్దంపాటు న్యాయపోరాటం జరగ్గా, మొత్తం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు స్కూల్‌ను సీజ్ చేయగా, రెవెన్యూ అధికారులు 8.70 సెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దాన్ని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు.
అయితే తమ సగం వాటా కోసం పోరూరి జనార్థనయ్య వారసులు జిల్లా కోర్టులో వేసిన వాజ్యం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కాగా, ఏడాది క్రితం వరకు నిషేధిత జాబితాలో ఉన్న ఆ ఆస్తిని ప్రస్తుతం అనూహ్యంగా ఆ జాబితా నుంచి తొలగించారు. రెవెన్యూ అధికారులే తొలగించారా? జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో మతలబు చేసి ఆ జాబితా నుంచి తీసివేయించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే లక్షల రూపాయలు చేతులు మారగా, కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని సొంతం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.