Dastagiri : 20 కోట్లు ఇస్తామన్నారు!
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:33 AM
వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ-5) కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు అప్పటి జైలు సూపరింటెండెంట్, జమ్మలమడుగు డీఎస్పీ..

సీబీఐ అధికారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్నారు
వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉండాలన్నారు
వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వెల్లడి
కడప, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): యువతి కిడ్నాప్ కేసులో కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ-5) కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు అప్పటి జైలు సూపరింటెండెంట్, జమ్మలమడుగు డీఎస్పీ, ఎర్రగుంట్ల సీఐ బెదిరించారని అప్రూవర్ దస్తగిరి చేసిన ఫిర్యాదుపై విచారణ మొదలైంది. విచారణాధికారిగా నియమితులైన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ్ శుక్రవారం అతడిని కడప సెంట్రల్ జైలుకు పిలిపించి మూడు గంటల పాటు ప్రశ్నించారు. దస్తగిరికి వరుసకు కూతురయ్యే యువతి ఓ ఎస్సీ యువకుడిని ప్రేమించింది. ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు దస్తగిరి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అతడిపై ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసులో 2023 అక్టోబరు 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు దస్తగిరి కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఎవరెవరు నిన్ను ఇబ్బంది పెట్టారు.. ఎలాంటి ప్రలోభాలకు గురిచేశారని రాహుల్ అతడిని అడిగినట్లు తెలిసింది. వివేకా హత్య కేసులో పలు వాస్తవాలు బయటకు చెప్పడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేక తనను ఇబ్బంది పెడుతున్నారని అతడు బదులిచ్చినట్లు సమాచారం. ‘వైద్యశిబిరం పేరిట డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి 2023 నవంబరు 20న జైల్లో నేను ఉంటున్న ఎస్‌ఎ్‌సఆర్ బ్యారక్‌లోకి వచ్చాడు. నువ్వు అప్రూవర్‌గా మారి మమ్మల్ని ఇబ్బంది పాల్జేశావు.. అప్పటి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా.. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెబితే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో వెళ్లిపోయాడు. నువ్వు జైలు నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరించాడు’ అని దస్తగిరి చెప్పినట్లు తెలిసింది.
తాను ఉన్న బ్యారక్ ఎదురుగా సీసీ కెమెరాలున్నాయని, అయితే చైతన్యరెడ్డి వచ్చే సమయంలో వాటిని తొలగించారని చెప్పాడు. మూడు నెలల తర్వాత ఎందుకు బహిర్గతం చేశావని విచారణాధికారి ప్రశ్నించగా.. ఆ రోజే చెబితే బయట ఉన్న తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉంటుందని భయపడి చెప్పలేదన్నాడు. ‘బెదిరింపుల విషయాన్ని నా భార్య మీడియా ముందు చెప్పడంతో అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ నాపై ఆగ్రహం వ్యక్తం చేసి జైల్లో ఇబ్బందులు పెట్టారు. నన్ను చీకటి గదిలో బంధించారు. నా భార్యకు మతిస్థిమితం లేక మీడియాతో మాట్లాడిందంటూ జైలు నుంచే లేఖ రాయాలని నాపై ఒత్తిడి తెచ్చారు’ అని వివరించినట్లు సమాచారం. దస్తగిరి పులివెందుల పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులోని ప్రతి అంశాన్నీ విచారణాధికారి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. కాగా.. అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్, చైతన్యరెడ్డి శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
జగనే చంపించి నారాసుర రక్తచరిత్ర అన్నారు
తన చిన్నాన్నను జగనే చంపించి తన పత్రికలో నారాసుర రక్తచరిత్ర రాయించారంటూ దస్తగిరి ఆరోపించాడు. విచారణ అనంతరం గేటు బయట విలేకరులతో మాట్లాడాడు. వివేకా హత్య కేసులో త్వరగా నిగ్గుతేల్చాలని జగన్ ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించాడు. ఈ కేసు త్వరలోనే తేలుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. జైల్లో తనను ఇబ్బంది పెట్టిన చైతన్యరెడ్డి, జైల్ సూపరింటెండెంట్ ప్రకాశ్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యపై కేసు పెట్టానని. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టిపెట్టాలని కోరాడు.
ఆ డాక్టరే కీలకం!!
జగన్ హయాంలో వివేకానందదెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఇతరులు కడప సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు.. అక్కడ ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. వీరిలో ఓ డాక్టర్ డబ్బులకు కక్కుర్తి పడి రిమాండ్ ఖైదీలకు గులాంగిరీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన వివేకా హత్య కేసులో ఉన్న కొందరికి కొమ్ముకాసినట్లు చెబుతారు. ఆ కేసులో ఉన్న ఓ రిమాండ్ ఖైదీ తన బ్యారక్‌లో కంటే ఈ డాక్టర్ రూములోనే ఎక్కువ రిలాక్స్ అవుతూ సెటిల్‌మెంట్లు సైతం చేశారని చర్చ నడుస్తోంది. సెంట్రల్ జైలుకు వెళ్లే డాక్టర్లకు తనిఖీలు ఉండవంటారు. దీనిని అడ్డుపెట్టుకుని ఈ డాక్టర్ అడ్డగోలుగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. ఈయన చొరవతోనే వైద్యశిబిరం పేరిట చైతన్యరెడ్డి కడప సెంట్రల్ జైలుకు వచ్చి దస్తగిరిని బ్లాక్‌మెయిల్ చేశాడని అంటున్నారు.