Kadapa: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్.. చంద్రబాబుకు విజ్ఞప్తి..
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:25 PM
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్‌ని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

వైఎస్ఆర్ కడప: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేశ్‌ని ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మైదుకూరు (Maidukuru) సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ని ఆయన కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ చేస్తున్న కృషిని గుర్తించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. అన్ని రకాలుగా యువతను పోత్సహించే విధంగా ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక పరిశ్రమలను ఏపీకి తెచ్చేందుకు లోకేశ్ విశేష కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పార్టీకి, యువతకు భరోసా ఇవ్వాలంటే లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ సీఎం చంద్రబాబు ఎదుట శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలు పెట్టారు.
కాగా, కడప జిల్లా మైదుకూరులో ఇవాళ(శనివారం) నిర్వహించిన ‘‘స్వేచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ద్వారా కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని, రెండేళ్లల్లో దాన్ని పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమకు గోదావరి నీటిని తీసుకువస్తామని, సీమ రైతులు మీసం తిప్పేలా చేస్తానని సీఎం చెప్పారు. వేంకటేశ్వరస్వామి పాదాల వరకూ గోదావరి నీటిని తీసుకువస్తామని, బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవిత ఆశయమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కడప స్టీల్‌ప్లాంట్, కొప్పర్తి ఇండస్ట్రీయల్ కారిడార్ త్వరలోనే పూర్తి చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. జనవరి చివరికల్లా వాట్సాప్ గవరెన్స్ తీసుకొస్తామని, గండికోటను టూరిజం హబ్‌గా చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Palnadu: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. చిన్నపిల్లలే లక్ష్యం.. సినిమా లెవల్ స్టోరీ..
Pawan Kalyan: స్వచ్ఛ దివస్‌లో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు