Share News

Krishna Board: తాగునీటికే ప్రాధాన్యమివ్వాలి!

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:15 AM

రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది.

 Krishna Board: తాగునీటికే  ప్రాధాన్యమివ్వాలి!

  • ఆ తర్వాతే సాగునీటికి వినియోగించాలి

  • సాగర్‌, శ్రీశైలం నీటి వినియోగంపై కృష్ణా బోర్డు ఆదేశం

  • సాగర్‌ నుంచి 7 వేల క్యూసెక్కులకు మించి తరలించొద్దు

  • ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించిన బోర్డు.. నేడు సమావేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం వివరాలను మంగళవారం విడుదల చేసింది. ఈ నెల 24 నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌ (కనీస నీటి మట్టం 834 అడుగులు)లో 24 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ (కనీస నీటిమట్టం 510 అడుగులు)లో 42.3 టీఎంసీల నిల్వలు ఉన్నాయని బోర్డు తెలిపింది. నీటి కొరత నేపథ్యంలో జూలై 31 దాకా ఈ నిల్వలను తాగునీటి కోసమే వినియోగించాలని తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఒంగోలు చీఫ్‌ ఇంజనీర్‌ (ఏపీ), నల్లగొండ చీఫ్‌ ఇంజనీర్‌ (తెలంగాణ) సమావేశమై ఏప్రిల్‌ దాకా సాగునీటి కోసం ఏ మేరకు నీళ్లు అవసరమో చర్చించుకొని, నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపును తగ్గించుకోవాలని, నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి 7 వేల క్యూసెక్కులకు మించి తరలించరాదని ఏపీకి స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలు సమర్పించే నీటి వినియోగ ప్రణాళికపై చర్చించడానికి వీలుగా బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కృష్ణా బోర్డు సమావేశం కానుంది. మే 31 దాకా కల్వకుర్తి, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ కింద 90 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 17 టీఎంసీలు, జూన్‌ 1 నుంచి జూలై 31 దాకా తాగునీటి అవసరాలకు 9 టీఎంసీలు మొత్తం 116 టీఎంసీల నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని బోర్డును తెలంగాణ కోరింది.

Updated Date - Feb 26 , 2025 | 05:15 AM