AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర
ABN , Publish Date - Jan 02 , 2025 | 02:15 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 14 కీలక అంశాలకు ఆమోద ముద్ర లభించింది. తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రి పడకలను 100కు పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది.
అమరావతి, జనవరి 2: ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 14 ఎంజెడా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశమవగా.. సుదీర్ఘంగా చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతిలో రూ.2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఔట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలిపారు.
గుంటూరు జిల్లా, పత్తిపాడు మండలం, నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఎజెండా పూర్తయ్యాక పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించారు. పలు కీలకమైన ప్రాజెక్టులపై కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.
పుష్ప నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
పీఎం పర్యటనపై..
అలాగే కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం విడిగా ముచ్చటించినట్లు తెలుస్తోంది. జనవరి 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వైజాగ్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనపై కేబినెట్‌లో చర్చించనట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని.. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సీఎం చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తూ కేబినెట్‌లో ఆమోద ముద్ర పడింది.
సూపర్ సిక్స్ పథకాలకు గ్రీన్ సిగ్నల్..
సూపర్ సిక్స్ పథకాలకు ఏపీ కేబినెట్ పచ్చ జెండా ఊపింది. వచ్చే విద్యాసంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలి అని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రివర్గ సమావేశం ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. పాఠశాలలు పునప్రారంభంలోపు తల్లికి వందనం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే పాఠశాలల పునప్రారంభంలోపు మెగా డీఎస్సీ అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులకు కేంద్రం నిధులు మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమల్లోకి తీసుకురావాలన్నారు. రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులు, జలవనరులు, ఆర్ధిక ఇబ్బందులపై సుదీర్ఘ చర్చ జరిగింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవిన్యూ, ఆర్థిక, మున్సిపల్, శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఏబీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
పథకాలు అమలు చేయాల్సిందే..
గోదావరి - బనకచర్ల అనుసంధానంపై మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టుకు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణపై చర్చించారు. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరు ఇచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగి వేమన నుంచి హంద్రీనీవా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధుల ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్దిపై మంత్రి పయ్యావుల వివరించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బకాయిలు ఎన్ని ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీయగా.. లక్ష 30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!
Read Latest AP News And Telugu News