Share News

AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:19 PM

Andhrapradesh: తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..
AP Ministers

అమరావతి, జనవరి 4: ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులో ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు నిన్న (శుక్రవారం) ఇంగ్లీషు, తెలుగులోనూ జీఓ ఏంఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయంపై మంత్రులు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad), అచ్చెన్నాయుడు (Atchannaidu), మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా తెలుగు భాషాభిమానులు, రచయితలు, కవులు కోరుకుంటున్నట్లుగా ఇక నుంచి తెలుగులో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడనున్నాయన్నారు.


90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ర్టంలో తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన మరింత పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం దివంగత నేత ఎన్టీఆర్‌ చేసిన కృషిని సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఆంగ్ల భాషలో ప్రవీణ్యం పెంచుకుంటూనే తల్లి భాష తెలుగులోని తియ్యదనాన్ని కూడా అందరూ అస్వాదించాలని మంత్రి అనగాని సత్యప్రాసాద్ పేర్కొన్నారు.

AP News: అడవిలో తప్పిపోయిన బీటెక్ విద్యార్థులు.. ఆపై సుడిగుండంలో పడి..


చంద్రబాబుకు కృతజ్ఞతలు: మంత్రి అచ్చెన్న

atchannaidu.jpg

అమ్మలాంటి మాతృభాషను గత ప్రభుత్వం అవమానపరిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషకు చంద్రబాబు హయాంలో సముచిత గౌరవం లభించిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాష పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతోందని తెలిపారు. సామాన్య ప్రజలు, పల్లెల్లో ప్రజానీకం అన్ని విషయాలు తెలుసుకునే విధంగా పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.


మరో మైలురాయి: రాంప్రసాద్

mandipalli-Ramprasad.jpg

ప్రభుత్వ పాలనలో కీలకమైన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) తెలుగులో జారీచేయడం మాతృ భాషకు పట్టం కట్టేందుకే అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం అనేది తెలుగుకు సముచిత గౌరవం ఇచ్చినట్లే అని తెలిపారు. తెలుగు మాతృభాష పట్ల సీఎం చంద్రబాబు ఔన్నత్యాన్ని చాటుకున్నారన్నారు. తెలుగు సంస్కృతి ఉనికికి ఈ నిర్ణయం మరో మైలు రాయి అని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇక వారిలో వణుకే

రూరల్ ఇండియా మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 04 , 2025 | 01:30 PM