CM Chandrababu: ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 02 , 2025 | 08:02 AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున ఆయన ప్రచారం చేస్తారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదివారం ఢిల్లీ పర్యటనకు (Delhi Visit) వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ తన నివాసం నుంచి ఆయన బయలుదేరనున్నారు. 2.55 గంటలకు చంద్రబాబు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు. 5.50 గంటలకు 1 జన్‌పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. కాగా ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు అక్కడకు వెళ్తున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. ఇటీవల ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో సీఎం తన ఢిల్లీ పర్యటనను ధ్రువీకరించారు. పార్టీ ఎంపీలు కూడా ఢిల్లీలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. తన దూకుడును పెంచింది. మూడు రోజుల క్రితం షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. అవినీతిని తొలగిస్తామంటూ అధికారంలోకి వచ్చి.. వేలాది కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఉల్లంఘించే పార్టీ ఆప్ అని ఆయన అభివర్ణించారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపిందంటూ కేజ్రీవాల్ విష ప్రచారం చేశారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీతో కేజ్రీవాల్ పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలవుతోందని కేజ్రీవాల్ ముందే గ్రహించారన్నారు. అందుకే యమునా నదిని విషపూరితం చేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో యమునా నదిని శుద్ది చేయడానికి వినియోగించాల్సిన నగదును అవినీతికి ఉపయోగించారన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీని అధికారంలో నుంచి దించాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్బోధించారు. ఎన్నికల్లో తన పార్టీకి ఓటమి తప్పదని గ్రహించే.. కేజ్రీవాల్ ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం.. యుమనా నది నీటిని కలుషితం చేసి.. వాటిని ప్రజల చేత బలవంతంగా తాగించిందన్నారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పిబ్రవరి 5వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 2013 నుంచి ఆప్ వరుసగా విజయం సాధిస్తు వస్తుంది. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాలనకు చరమ గీతం పాడేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరి ఢిల్లీ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు వేచి చూడాలన్నది సుస్పష్టం.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News