YS Sharmila: బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన షర్మిల
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:45 PM
YS Sharmila: సీబీఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. ఆ వ్యవస్థ లను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మాగాంధీని బీజేపీ విలన్‌గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ, జనవరి 11: బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ (BJP) గుప్పిట్లో పెట్టుకుంటోందని ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసేలే కుట్రలు చేస్తోందని.. చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారోయిందని మండిపడ్డారు. బీజేపీ దళితులంటే చిన్నచూపన్నారు. రాజ్యాంగ నిర్మత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కమలంపార్టీ అవమాన పాలు చేసిందని విమర్శించారు. శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మతం, కులం పేరుతో బీజేపీ దేశంలో రాజకీయాలు చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని.. ఆ వ్యవస్థ లను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయ మయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మాగాంధీని బీజేపీ విలన్‌గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన్ను చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గం వైపు బీజేపీ పాలన సాగుతుందన్నారు. చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. అంబేద్కర్‌ను కూడా వదలకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజంలో జస్టీస్, సమానత్వం ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగం కారణమని చెప్పుకొచ్చారు. ఆయన్ను కూడా పార్లమెంటులో ఎంత హేళన చేశారో చూశామన్నారు. దళితులు అంటేనే చిన్న చూపు బీజేపీకి అని విమర్శించారు. కుల గణన విషయంలో కూడా బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది తేలిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీరి ముగ్గురు మాట్లాడరన్నారు. అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై..
తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వం వైఫల్యం కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి విచారణ కోరిందన్నారు. ఉన్నతస్థాయి విచారణ చేసి బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. లడ్డూ వివాదం తరహాలో ఈ ఘటనపై కూడా చంద్రబాబు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. భద్రతాపరమైన లోపాల వల్లే ఈ తొక్కిసలాట జరిగిందనేది వాస్తవమన్నారు. అంతమంది వచ్చిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందని.. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ తరపున సంతాపం తెలియ చేస్తున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దేవుడా.. నీకు మనసెలా వచ్చిందయ్యా..
Read Latest AP News And Telugu News