Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:34 PM
Vamshi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై ఎస్పీ ఎస్టీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.

విజయవాడ, ఫిబ్రవరి 20: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సాక్షులను కిడ్నాప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamshi) కస్టడీ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో (SC ST Court) గురువారం విచారణ జరిగింది. వాదనలు పూర్తి అవగా.. తీర్పును రేపు (శుక్రవారం) వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. జైల్లో బెడ్, బయట నుంచి ఫుడ్ తెచ్చుకోడానికి అనుమతించాలన్న పిటిషన్‌పై కూడా రేపే తీర్పు చెబుతామని కోర్టు స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఈ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదనలు జరుగగా... నేటితో వాదనలు ముగిశాయి.
వాదనల్లో భాగంగా వంశీని ప్రత్యేక సెల్‌లో ఎందుకు ఉంచారని న్యాయమూర్తి ప్రశ్నించారు. జైలులో బ్లెడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని వంశీ మాజీ ఎమ్మెల్యే కావటంతో భద్రత దృష్ట్యా ప్రత్యేక సెల్‌లో ఉంచామని జైలు సూపరింటెండెంట్ పాల్ తెలిపారు. టేలర్ బోన్ సమస్య వల్ల వంశీ మంచం మాదిరి ఎత్తున్న టేబుల్ ఏర్పాటు చేయాలని వంశీ న్యాయవాదులు కోరారు. ఈ పిటిషన్‌పై పీపీకి వాదనలు అవసరం లేదని నేరుగా జైలు సిబ్బంది, డాక్టర్‌తో మాట్లాడుతామని న్యాయమూర్తి చెప్పారు.
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..
ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీ అవసరమని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. వంశీకి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాదులు వాదించారు. పది రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీ ఇవ్వనవసరం లేదని వాదనలు వినిపించారు. వాదనలు ముగియగా.. తీర్పును రేపు వెలువరిస్తామని ఎస్సీ, ఎస్టీ కోర్టు తెలిపింది.
మరోవైపు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంచం ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటి వద్ద నుంచి భోజనాన్ని తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనిపై కూడా వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌కు సంబంధించి జైలు సూపరింటెడెంట్‌తో పాటు విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు కూడా కోర్టుకు వచ్చి నివేదిక ఇవ్వాలని నిన్నటి విచారణలో కోర్టు ఆదేశించింది. దీంతో ఆ ఇద్దరు కూడా కోర్టుకు వచ్చారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని.. తమ వద్ద స్పష్టమైన నివేదిక లేదని న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో వంశీని పరీక్షించి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.
అలాగే వంశీ బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. అయితే వంశీ ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని, రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారంటూ వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్, జైలులో సౌకర్యాలపై మొత్తం మూడు అంశాలపై రేపు ఎస్సీ, ఎస్టీ కోర్టులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు
Read Latest AP News And Telugu News