Vijayawada: నూతన సంవత్సరం వేళ విజయవాడ సీపీ సూచనలు ఇవే..
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:47 AM
ఆంధ్రప్రదేశ్: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తన సిబ్బందితో కలిసి వాహనదారులకు పోలీస్ శాఖ తరఫున హెల్మెట్‌లు పంపిణీ చేశారు.
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో యువకులు పెద్దఎత్తున న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో పబ్బులు, రోడ్లపై యువత ఎంజాయ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి 2024 ఏడాదికి గుడ్ బై చెప్తూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. మరోవైపు తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది మాత్రం అదే పని చేసి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడ్డారు.
మరోవైపు కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తన సిబ్బందితో కలిసి వాహనదారులకు పోలీస్ శాఖ తరఫున హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలతో యువత ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. పది రోజులుగా తమ సిబ్బంది చేపట్టిన డ్రైవ్ కారణంగా వాహనాదారుల్లో మార్పు వచ్చిందని సీపీ చెప్పుకొచ్చారు.
ద్విచక్రవాహనదారులు ప్రయాణం చేసే సమయంలో కుటుంబసభ్యులను గుర్తుచేసుకుని హెల్మెట్ విధిగా వాడాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు. సీటు బెల్ట్, హెల్మెట్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. అలాంటి వారి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోకుండా, 2025లో తప్పకుండా సురక్షిత ప్రయాణం చేయాలని సీపీ రాజశేఖర్ బాబు ఆకాంక్షించారు.
మరోవైపు నూతన సంవత్సరం వేళ పలు ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున ఆలయాలకు పోటెత్తుతున్నారు. చర్చిలు, హిందూ ఆలయాల్లో కొత్త సంవత్సర వేడుకలు వెల్లువిరిశాయి. ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి, 2025లో తమకు అన్నీ శుభాలే కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.