Share News

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:15 PM

ఆంధ్రప్రదేశ్: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారని కొనియాడారు.

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) బీజేపీ (BJP) విజయం వైపు పరుగులు పెడుతోంది. రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ (Kejriwal) సహా ఆ పార్టీ నేతలు ఘోరంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ సైతం చతికలపడిపోయింది. దీంతో బీజేపీ విజయం దాదాపు ఖరారయ్యింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయం పార్టీ విజయ ఢంకా మోగించడంతో ఎన్డీయే శ్రేణులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కూటమి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.."2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్రస్థాయికి చేరతాయి.


ఢిల్లీ అభివృద్ధికి, ఆ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ఢిల్లీ ప్రజలు విశ్వసించారు. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి కారకులైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు" తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Delhi Elections 2025: బీజేపీ ఘన విజయం.. తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల రియాక్షన్..

AP Women: చిత్రహింసలకు గురిచేస్తున్నారు... కువైట్‌లో మరో తెలుగు మహిళ ఆవేదన

Updated Date - Feb 08 , 2025 | 04:15 PM