Share News

Operation Garuda AP: ఏపీలో ఆపరేషన్ గరుడ.. ఖంగుతిన్న మెడికల్‌షాప్ యజమానులు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:05 PM

Operation Garuda AP: ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో సోదాలు కొనసాగుతున్నాయి.

Operation Garuda AP: ఏపీలో ఆపరేషన్ గరుడ.. ఖంగుతిన్న మెడికల్‌షాప్ యజమానులు
Operation Garuda AP

అమరావతి, మార్చి 21: ఏపీలో ఆపరేషన్ గరుడ (Operation Garuda) కొనసాగుతోంది. ఆపరేషన్ గరుడ లో భాగంగా డీజీపీ (AP DGP) ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ ఎండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీస్‌పై అధికారులు దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో అక్రమ మత్తుపదార్థాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.


కడప: నగరంలో ఆపరేషన్ గరుడ జోరుగా సాగుతోంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు మెడికల్ షాప్‌లపై దాడులు చేస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఏఎస్‌పీ శ్రీనివాసుల రావు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. కడపలోని మెడికల్ షాపుల్లో అక్రమ మత్తుపదార్ధాలు ఉన్నాయని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కడప, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, మదనపల్లెలో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెడికల్ దుకాణాల్లో సరైన రికార్డులు ఉన్నాయా లేదా అని తనిఖీలు నిర్వహించామన్నారు. మత్తును కలిగించే మందులు అమ్మడం నేరం కాకపోయినా వైద్యుల పర్యవేక్షణ, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం నేరమని తెలిపారు. పలు మెడికల్ దుకాణాలపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

medical-2.jpg

Good News: రేషన్ కార్డు దారులకు శుభవార్త..


నెల్లూరు: నగరంలో కెమిస్ట్రీ అండ్ డ్రగ్ దుకాణాలపై విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. యువకులకు మత్తు పదార్ధాల అక్రమ అమ్మకాలను అడ్డుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ షాపులలో మత్తు మాత్రలు అక్రమంగా అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోలర్ శాఖ, పోలీసుశాఖ ఆకస్మిక తనిఖీలతో మందుల షాపు దుకాణాదారులు ఖంగుతిన్నారు.


అనంతపురం: విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్, డ్రగ్స్ అధికారులు మెడికల్ షాపుల్లో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, శ్రీ కంఠం సర్కిల్‌లలో ఒకే సమయంలో మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మెడికల్ షాపుల్లోని బిల్లులను, అనధికార మందులను వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా మెడికల్ షాపుల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. శ్యాంపుల్ డ్రగ్స్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఎక్స్ (NRx) డ్రగ్స్‌ను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని.. వీటి వివరాలను ఆరా తీస్తున్నామని ప్రసాద్ వెల్లడించారు.


రాజమండ్రి: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు, మందుల షాపులపై విజిలెన్స్ , డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఈగల్ బృందాలు దాడులు నిర్వహించారు. రాజమండ్రి గణేష్ చౌక్ తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపులలో నాలుగు ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజన్సీలో విక్రయిస్తున్న ట్రమడాలు, మత్తు మందు 255 ఇంజక్షన్లను విజిలెన్స్ ఎస్పీ స్నేహిత పట్టుకున్నారు. యువత కొంతమంది తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్స్‌ను విరివిగా వాడుతున్నట్టు సమాచారం అందిందని విజిలెన్స్ ఎస్పీ స్నేహిత తెలిపారు. అందుకే డీజీపీ ఆదేశాలతో జిల్లాలో 16 చోట్ల దాడులు చేస్తున్నామన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలో, మెడికల్ షాపులలో ట్రమాడాల్ ఇంజక్షన్లు, మత్తు కలిగించే సిరఫ్‌లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ స్నేహిత హెచ్చరించారు.

medical.jpg


విజయవాడ: నగర వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ టీమ్ దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని.. మొత్తం 100 టీమ్స్‌తో దాడులు చేస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి అందుబాటులో లేకపోవడంతో మత్తు టాబ్లెట్స్‌కు బానిసలుగా మారుతున్నారన్నారు. మెడికల్ షాపు నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్నారన్నారు. యువత మత్తు టాబ్లెట్స్ తీసుకొని మత్తులో జోగుతున్నారని, మత్తులో యువత నేరాలవైపు అడుగులు వేసే అవకాశం ఉందని తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ మెడికల్ షాప్ నిర్వాహకులు అమ్మితే చట్టపరమైన చర్యలు చేపడుతామని.. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని రవికృష్ణ హెచ్చరించారు.


శ్రీకాకుళం: జిల్లాలో పలు మెడికల్ షాపుల్లో ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల మెడికల్ షాపులలో డ్రగ్, విజిలెన్స్, పోలీస్, ఈగల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

కర్నూలు: జిల్లాలోని నంద్యాల ఆదోనిలో ఆపరేషన్ గరుడ కొనసాగుతోంది. మెడికల్ షాపులు, ఏజెన్సీలపై ఈగల్, విజిలెన్స్ పోలీసు డ్రగ్స్ కంట్రోల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఇందులో భాగంగా భారీగా ఎన్ఆర్‌ఐ డ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు. డాక్టర్ మందుల చీటి లేకుండానే మెడికల్ షాపు నిర్వాహకులు నేరుగా జనానికి మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.


అంబేద్కర్ కోనసీమ: జిల్లాలోని అమలాపురంలో ఆపరేషన్ గరుడా పేరుతో మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిని స్నేహిత ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్జిస్ట్ , మందుల షాపులలో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడను చేపట్టినట్టు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మధు వెల్లడించారు. విజిలెన్స్ దాడుల నేపథ్యంలో పట్టణంలో పలు మందుల షాపు నిర్వాహకులు.. మెడికల్ షాపులు మూసివేశారు.

medical-1.jpg


అవనిగడ్డ: ఆపరేషన్ గరుడలో భాగంగా కృష్ణాజిల్లా అవనిగడ్డలో మందుల దుకాణాలపై ఈగల్ బృందాల దాడులు నిర్వహించారు. మందుల దుకాణాల్లో మందుల నాణ్యత, బిల్లులను ఈగల్ అధికారుల బృందం తనిఖీ చేస్తోంది. అవనిగడ్డలో జరుగుతున్న దాడుల్లో విజిలెన్స్ ఐజీ రవికృష్ణ నేరుగా పాల్గొన్నారు. మందుల చీటీ లేకుండా విక్రయాలు ఎలా జరుపుతున్నారని మందుల షాపు నిర్వాహకులను ఐజీ నిలదీశారు.


ఇవి కూడా చదవండి...

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 04:52 PM