Vijayasai Reddy: ఎంపీ పదవికి రాజీనామా.. కూటమి నుంచి డబ్బులు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:20 AM
Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయి ఈరోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు.

న్యూఢిల్లీ, జనవరి 25: వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasaireddy) రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు ఎంపీ. రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు నిన్న ప్రకటించిన విజయసాయి ఈరోజు ఢిల్లీలోని రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే...
రాజీనామా అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు. రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారన్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో రాజీనామానే కాకుండా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిందన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని.. ప్రజాదరణ జగన్‌కు తగ్గదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నానని.. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి అన్ని వివరాలు చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు.
TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్ రియాక్షన్
‘‘వెళ్లిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను... నేను ఏ పార్టీలో చేరడం లేదు.. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా ,వేంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. వైఎస్ కుటుంబంతో సున్నిహిత సంబంధాలు ఉన్నాయి . జగన్ అక్రమ కేసులో నన్ను అప్రూవర్ మారాలని ఎంతో మంది ఒత్తిడి తెచ్చారు. నేను అబద్ధాలు చెప్పను. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో నాపై కేసు పెట్టారు. కేవీ రావు నాకు ఎలాంటి సంబంధాలు లేవు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆయన వారి పిల్లల సాక్షిగా చెప్పాలి. నేను నా పిల్లలపై ప్రమాణం చేసి చెప్తాను. సీఐడీ నన్ను విచారణకు రావాలని చెప్పలేదు. నాపై లుక్ అవుట్ నోటీస్ ఇచ్చారు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కూటమికే లబ్ది...
‘‘నా రాజీనామా కూటమి కే లబ్ది.. నా ప్రాతినిధ్యాన్ని ఎవరు తక్కువ చేయలేరు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ వీడినా జగన్‌కు, పార్టీకి నష్టం లేదు. లండన్‌లో ఉన్న జగన్‌తో అన్ని అంశాలు మాట్లాడాకే నా రాజీనామాను అందించా. రాజకీయాల నుంచి తప్పుకున్నా, ఇక రాజకీయాల గురించి మాట్లాడను. నాలుగు దశాబ్దాలుగా జగన్‌తో, ఆయన కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనతో ఎప్పుడూ విభేదాలు లేవు, భవిష్యత్‌లో రావు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాపై కేసు నమోదు చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు. విక్రాంత్ రెడ్డిని నేను పంపించలేదు, కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో నా ప్రమేయం లేదు. విక్రాంత్ రెడ్డి ని కేవీ రావుకు నేను పరిచయం చేయలేదు. నాకు వ్యాపారాలు లేవు, దేనిలో నేను భాగస్వామిని కాదు. వ్యాపార లావాదేవీలు నాతో నా వియ్యంకుడు ఎప్పుడు చర్చించరు, వారి వ్యాపారాల గురించి నాకు తెలియదు. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను బలహీనుడిగా మారుతాను, నన్ను ఎందుకు కేసుల నుంచి తప్పిస్తారు? రాజకీయాల్లో నా పాత్రకు న్యాయం చేయలేను అనే రాజకీయలనుంచి దూరం అవుతున్నా. కేసులకు భయపడే తత్వం నాది కాదు, దేన్నైనా దైర్యంగా ఎదుర్కుంటా. గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరిదగ్గర హామీ తీసుకోలేదు. బెంగళూరు, విజయవాడలో ఒక ఇల్లు, వైజాగ్‌లో ఒక అపార్ట్మెంట్ ఇవే నా ఆస్తులు. నీతిగా, నిజాయితీగా బతకాలని అనుకున్నా, కొన్ని ఛానెల్స్ నాపై అవినీతిపరుడనే ఆరోపణలు చేసాయి. ఛానెల్ పెట్టె అంశంపై పునరాలోచన చేస్తా. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత ఎవరు తగ్గించలేరు. నా కెపాసిటీ, సామర్థ్యం ఎవరు అంచనా వేయలేరు. చంద్రబాబు నాయుడును రాజకీయంగా నేను వ్యతిరేకించాను. చంద్రబాబు నాయుడు కుటుంబ పరంగా ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. మనసులో ఎక్కడో కొంత బాధ ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మిగతా వారు అయితే నాకంటే సమర్థవంతంగా పనిచేస్తారు’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్ రియాక్షన్
Read Latest AP News And Telugu News