Share News

CM Chandrababu.. సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 14 , 2025 | 10:08 AM

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ)ఏర్పాటు చేశారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, రవీంద్రభారతి, లలితకళల అకాడమీ కూడా అప్పుడే నెలకొన్నాయి. టీచర్లకూ పింఛన్‌, అప్పట్లో ఉపాధ్యాయులకు పింఛను సౌకర్యం లేదు. బతకలేక బడి పంతులు అని.. బాధపడే రోజులవి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారు.

CM Chandrababu.. సంజీవయ్య  జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు
CM Chandrababu..

అమరావతి: నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevayya) 104వ జయంతి (104th Birth Anniversar) సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఘనంగా నివాళులు (Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని అన్నారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశసేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

వల్లభనేని వంశీ నొటోరియస్‌ క్రిమినల్‌


కర్నూలు నగరంలో నేడు అంతర్భాగంగా ఉన్న కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో 1921 ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య జన్మించారు మునెయ్య, సుంకలమ్మ దంపతులకు ఆయన ఐదో సంతానం. కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. జీవనాధారం కోసం పశువులు కాయడం, కూలి పనులకు వెళ్లడం, పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేయడం, ఖాళీ సమయాల్లో చేనేత వస్త్రాలు విక్రయించేవారని అప్పటి పెద్దల ద్వారా తెలుసుకున్నామని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన జన్మించేనాటికి ఇంట్లో అందరూ నిరక్షరాస్యులే. అయితే, సంజీవయ్యకు చదువు పట్ల అమిత ఆసక్తి. అది గుర్తించిన అన్న చిన్నయ్య, మేనమామల ప్రోత్సాహాంతో సంజీవయ్య చదువులో ఒక్కో మెట్టు ఎక్కారు. బ్రిటిష్‌ పాలనలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. కేంద్ర ప్రజా పనుల తనిఖీ అధికారిగా పని చేస్తుండగా న్యాయమూర్తి జస్టిస్‌ కేఆర్‌ కృష్ణయ్యతో పరిచయం అయింది ఆయన ప్రోత్సాహంతో మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. గణపతి శాస్త్రి, జాస్తి రామలక్ష్మమ్మ దగ్గర జూనియర్‌గా పనిచేశారు. 1950లో భారత్‌ గణతంత్ర దేశంగా ఆవిర్భావం తర్వాత ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నిబంధన వచ్చింది. కర్నూలుకు చెందిన సర్దార్‌ నాగప్ప ఎమ్మెల్యే, ఎంపీ రెండు పదవుల్లో ఉండగా.. ఎమ్మెల్యే పదవి ఉంచుకుని ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ సీటు ఎస్సీ రిజర్వుడు కావడంతో, రామలక్ష్మమ్మ సిఫారసుతో ఆ పదవి సంజీవయ్యను వరించింది. 1952లో ఎమ్మెల్యేగా గెలిచి రాజాజీ కేబినెట్‌లో చేరారు. అప్పటికి ఆయన వయసు 31ఏళ్లే. ఆంధ్ర రాష్ట్రం తొలి సీఎం ప్రకాశం పంతులు కేబినెట్‌లోను, బెజవాడ గోపాలరెడ్డి కేబినెట్‌లోను, ఉమ్మడి ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోను బాధ్యతలు చేపట్టారు. ప్రధానులు నెహ్రూ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పనిచేశారు. నెహ్రూ, ఇందిర హయాంలో రెండు పర్యాయాలు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. నీలం సంజీవరెడ్డి కొన్ని కారణాలతో 1960లో పదవి కోల్పోయారు. నీలం స్థానంలో అప్పటి కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. ఓ దళిత నాయకుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం దేశంలోనే అది ప్రథమం. 1960-1962 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఉపాధ్యాయురాలు కృష్ణవేణితో 1954 మే7న సంజీవయ్య వివాహం జరిగింది. ఆయన 1967 ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై.. దీర్ఘకాలంగా కోలుకోలేకపోయారు. 1972 మే7న ఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..

ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్

వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 14 , 2025 | 10:22 AM