Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:51 AM
Kakani Skipping Police Inquiry: పోలీసుల విచారణకు సహకరించకుండా హైడ్రామాకు తెరలేపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు మాజీ మంత్రి గైర్హాజరయ్యారు.

నెల్లూరు, ఏప్రిల్ 3: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Former Minister Kakani Goverdhan Reddy) హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు. అక్రమమైనింగ్ కేసులో ఇప్పటి వరకు మూడు సార్లు కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనను కలిసి నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించిన ప్రతీసారి కాకాణి మాత్రం తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. దీంతో ఆయన బంధువులకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు.
నిన్న(బుధవారం) కూడా కాకాణి హైదరాబాద్‌లో ఉన్నారని పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్‌లోని నివాసానికి వెళ్లారు. కాకాణి నివాసంలో ఓ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్న ఆయన.. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి జంప్ అయ్యారు. తీరా అక్కడకు వెళ్లిన పోలీసులు నిరాశే ఎదురైంది. కాకాణి లేడని తెలుసుకున్న పోలీసులు అక్కడ ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3న (గురువారం) నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈసారి కచ్చితంగా విచారణ రావాలని పోలీసులు స్పష్టం చేశారు. అయితే మూడో సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
మూడవ సారి కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు మాజీ మంత్రి. పోలీసుల విచారణకు అస్సలు సహకరించకుండా కాకాణి హైడ్రామా ఆడుతున్న పరిస్థితి. ఇటీవల పోలీసు అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించి, దూషించారు కాకాణి. గతంలోనూ ఓ కేసులో ఇదే తరాహాలో కాకాణి హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కాకాణిపై అక్రమ మైనింగ్ కేసుతో పాటు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు అయ్యింది. పరారీలో ఉంటూనే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం కాకాణి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు పోలీసుల నుంచి తప్పించుకుని బెయిల్ తెచ్చుకునేందుకు కాకాణి విశ్వ ప్రయత్నం చేస్తుండగా.. ఎలాగైన కాకాణిని విచారించాలని పోలీసులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు మూడవ సారి కూడా కాకాణి విచారణకు రాలేని నేపథ్యంలో పోలీసులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Read Latest AP News And Telugu News