YCP: నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:27 AM
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

నెల్లూరు: వైసీపీ (YCP) నేతల్లో టెన్షన్ (Tension) వాతావరణం నెలకొంది. క్వార్ట్జ్ కుంభకోణం (Quartz Scam), భారీ ఎత్తున పేలుడు (Explosives) పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నిందితుల కదలికలపై పోలీసులు (Police) డేగకన్ను వేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) సహా అయిదుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కాకాణి ఇంటి ప్రధాన గేట్లకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రిమాండ్‌లో ఉన్న నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. విచారణను న్యాయస్థానం మంగళవారం నాటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ కోసం కాకణి గోవర్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ కూడా మంగళవారం నాటికి వాయిదా వేసింది.
Also Read..: ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
కాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంటికి ఆదివారం నాడు పోలీసులు వెళ్లారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న విషయం ముందుగా తెలుసుకున్న కాకాణి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతనికి చెందిన రెండు ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. రెండు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చామని తెలిపారు. కాకాణి, ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నాయని అన్నారు. నోటీసుల ప్రకారం సోమవారం (31వ తేదీ) ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. కాకణి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.
కాగా నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదివరకే ముగ్గురిపై కేసు పెట్టగా, తాజాగా కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకాణితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని క్వార్డ్జ్ నిక్షేపాలన్నింటినీ నెల్లూరుకు చెందిన ఒక మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ క్వార్డ్జ్ తవ్వకాలు జరిగాయి. రుస్తుం మైన్స్ నుంచి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొట్టారు. రుస్తుం మైన్స్‌ను గతంలో ఒకరికి లీజుకు ఇచ్చారు. ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్‌పై కన్నేశారు. పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఈ ముఠా వెనుక అప్పటి మంత్రి కాకాణి హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. అప్పటి వరకు ఆ క్వారీ వైపు కన్నెత్తి కూడా చూడని మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి దోచుకుపోయిన క్వార్డ్జ్ విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురిపై కేసు కట్టారు. వీరిలో కాకాణికి కుడిభుజమైన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి పేర్లతో తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ముగ్గురు పోలీసులు తమ వద్దకు రాకముందే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా మరో ఏడుగురిని ఈ కేసులో చేర్చారు.
కాకాణి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ప్రస్తుత పరిణామాలను గమనిస్తే మాజీ మంత్రి కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి కష్టకాలం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నా రాజకీయ జీవిత కథను నేనే రాశా
For More AP News and Telugu News