Srisailam Dam : శ్రీశైలం డ్యాంకు ‘ప్లంజ్’ ముప్పు!
ABN , Publish Date - Jan 24 , 2025 | 05:14 AM
ప్లంజ్‌పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది.. దీనిపై అధ్యయనం చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును

అధ్యయనానికి ఏళ్లుగా పడని అడుగులు
చంద్రబాబు సీఎం అయ్యాక ఇందుకోసం రూ.14 కోట్లు మంజూరు
8సీడబ్ల్యూపీఆర్‌సీకి బాధ్యత అప్పగించాలని ప్రభుత్వానికి ఇంజనీర్ల నివేదిక
ఇటీవలి కృష్ణా బోర్డు భేటీలో దీనిపై చర్చ
స్టడీకి అభ్యంతరం లేదన్న తెలంగాణ
తక్షణ చర్యలకు రాష్ట్ర సర్కారుకు బోర్డు సూచన
కర్నూలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్లంజ్‌పూల్ గుంత వల్ల శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉంది.. దీనిపై అధ్యయనం చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందాలు పలుమార్లు తేల్చి చెప్పాయి. ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చాయి. కానీ ఏళ్లు గడచినా ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అధ్యయనం కోసం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్‌సీ)కి నామినేషన్‌పై ఇచ్చేందుకు అనుమతి కోరుతూ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మంగళవారం హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. 2009 నాటి భారీ వరదల కారణంగా.. డ్యాం స్పిల్‌వే గేట్ల నుంచి అతివేగంగా కింద పడే ప్రవాహం మళ్లీ ఎగిసిపడే ప్రాంతం (ప్లంజ్‌పూల్)లో భారీ గుంత ఏర్పడింది. ఈ గుంత లోతు 45 మీటర్లు, వెడల్పు 270 మీటర్లు, పొడవు 400 మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం డ్యాంను సీఎం చంద్రబాబు సందర్శించారు.
ఆ సమయంలో ప్లంజ్‌పూల్ సమస్యతో పాటు మరమ్మతులపై ప్రాజెక్టు ఇంజనీర్లు ఆయనకు వివరించారు. ఆ తర్వాత ప్లంజ్‌పూల్ గుంత వల్ల ఏ మేరకు ప్రమాదం పొంచి ఉందో అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌సీకి నైపుణ్యం ఉందని.. టెండర్లు లేకుండా నామినేషన్‌పై అధ్యయన బాధ్యతలు అప్పగించేందుకు అనుమతులు సహా తక్షణమే రూ.3.70 కోట్లు మంజూరు చేయాలని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై కేఆర్‌ఎంబీ సమావేశంలో చర్చించినప్పుడు.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తక్షణమే ప్లంజ్‌పూల్‌పై అధ్యయనం చేయించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించినట్లు సమాచారం.
శాశ్వత మరమ్మతులు ఎప్పుడో..?
శ్రీశైలం డ్యాం 2009 నాటి వరదలకు భారీగా దెబ్బతింది. అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. రిటైనింగ్ వాల్ 2.50 కిలోమీటర్లు ఉంటే.. 600 మీటర్లు పూర్తిగా కొట్టుకుపోయింది. శాశ్వత మరమ్మతులు చేపట్టాలంటే అప్రోచ్ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణం అత్యవసరమని నిపుణుల కమిటీలు సూచించాయి. ఆయా పనుల కోసం డ్రిప్-2 కింద రూ.190 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. గతేడాది ఫిబ్రవరిలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) చైర్మన్ వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని నిపుణుల బృందం, కేఆర్‌ఎంబీ సభ్యులు డ్యాం భద్రత, నిర్వహణ. నీటి నిల్వలు, వినియోగం తదితర అంశాలను పరిశీలించారు.
ఆ తర్వాత డ్యాంను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం మరమ్మతులకు తొలి విడత రూ.108 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ ఎన్‌వోసీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉందని ఇంజనీర్లు అంటున్నారు. దాని ఆమోదం లభిస్తే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి వచ్చే ఖరీఫ్ నాటికి వేసవిలో మరమ్మతు పనులు పూర్తి చేయవచ్చని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం డ్యాం శాశ్వత మర్మతులపై సానుకూల నిర్ణయం తీసుకున్నా.. ఆ ఫైలు ఆర్థిక శాఖ అడ్డంకులు దాటి టెండర్ల దశకు చేరుకుంటుందా అన్న సందేహం తలెత్తుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News