Share News

Compensation : పరిహారం పండగ

ABN , Publish Date - Jan 04 , 2025 | 03:31 AM

పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి ఎన్నో ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు శుక్రవారం ఉదయం తీపికబురు అందింది.

Compensation : పరిహారం పండగ

  • పోలవరం నిర్వాసితులకు ఒకేరోజు రూ.815 కోట్లు

  • ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు కొత్త ఏడాది వేళ తెర

  • అనూహ్యంగా పరిహారాల చెల్లింపు

  • నిర్వాసితుల్లో పెల్లుబికిన సంతోషం

  • ఊరూరా సంబరాలు.. పాలాభిషేకాలు

ఏలూరు/కుక్కునూరు/రంపచోడవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి ఎన్నో ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు శుక్రవారం ఉదయం తీపికబురు అందింది. ఉదయం 8 గంటల నుంచి వారి ఖాతాల్లో పరిహారం జమ అవుతుండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. 2017 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో భూముల పరిహారం రూ.800 కోట్లు జమ అయింది. ఇప్పుడు మళ్లీ ఏడేళ్ల తర్వాత ఆయన సారథ్యంలోని కూటమి సర్కారు హయాంలోనే ఒకేరోజు ఇంకో రూ.815 కోట్లు వచ్చాయి. 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న నిర్వాసిత గ్రామాలకు.. వ్యక్తిగత పునరావాస పరిహారం, కోల్పోతున్న ఇళ్లకు పరిహారం, పునరావాస కాలనీలో ఇళ్లు వద్దనుకున్న వారికి ఈ మొత్తం పరిహారం కింద జమ అవుతుండడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏదో ఒక పరిహారం ఖాతాలో పడుతుందనుకున్నాం. కానీ ఇలా పూర్తిస్థాయిలో జమ కావడం కొత్త సంవత్సర కానుకే’ అని అభివర్ణిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వ్యక్తిగత పరిహారం పేరిట జగన్‌ అండ్‌ కో నాటకాలాడారు. ఇది నమ్మి ఓట్లు కుమ్మరించడంతో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఘనవిజయం సాధించింది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా వ్యక్తిగత పరిహారం రూ.పది లక్షలకు పెంచుతామని జగన్‌ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. కానీ పైసా ఇవ్వలేదు. చివరకు 2024 ఎన్నికలకు ఆరు నెలలు ముందు.. మరోసారి పరిహారం పెంచి ఆ సొమ్మంతా జమ చేస్తున్నట్లు ప్రకటించి..ఒకరిద్దరి ఖాతాల్లో వేసి.. మిగతా వారిని వలలో వేసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా ఓట్లు దండుకోవడానికి వైసీపీ పన్నాగంగా గమనించిన ఓటర్లు.. చుక్కలు చూపించారు.


పోలవరంలో టీడీపీ కూటమి అభ్యర్థిని గెలిపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు నిర్వాసితులకు రూ.815 కోట్లు జమయ్యాయి. దేవీపట్నం మండలంలో 567 నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లో శుక్రవారం రూ.37.45 కోట్లు పడ్డాయి. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడుతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ పరిహారం జమయింది. పునరావాస కాలనీల్లో ఇల్లు వద్దనుకున్న ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల 85 వేలు, అదే కాలనీలో స్థలం వద్దనుకునే వారికి రూ.లక్ష చొప్పున ఇంతకు ముందే ప్రకటించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా ఆయా కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఆరంభమైంది. ఎవరిరెవరికి ఎంత మొత్తం పడిందో పూర్తి వివరాలు శనివారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

  • ఊరూరా సంబరాలు..

ఎవరూ ఊహించని విధంగా పరిహారాలు జమవుతుండడంతో నిర్వాసిత గ్రామాలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నాయి. ఊరూరా సంబరాలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు జేజేలు పలుకుతూ వారి చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కుక్కునూరులో భారీ ప్రదర్శన చేపట్టారు. పాలాభిషేకం చేసి, బాణసంచా కాల్చారు. నిర్వాసితులతో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, ఉపసర్పంచ్‌ పిచ్చుక రాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు ఎం.యుగంధర్‌, మంత్రి గోపాలకృష్ణ, బీజేపీ నాయకులు లక్ష్మణాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం మండలం టేకూరు, మాధాపురం, కోండ్రుకోట తదితర గ్రామాలకు ఇతర మండలాలకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారాలు, ఇళ్ల పరిహారాలు, ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.2.85 లక్షలు, మృతి చెందిన లబ్ధిదారుల నామినీలకు పరిహారాలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 95 శాతం పరిహారాలు అందాయి. గిరిజనులకు రూ.7.11 లక్షలు, గిరిజనేతరులకు రూ.6.36 లక్షల చొప్పున ఖాతాల్లో పడ్డాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటున్న 567 కుటుంబాల ఖాతాల్లో రూ.3.74 కోట్లు జమయ్యాయి. దీంతో దేవీపట్నం సర్పంచ్‌ కుంజం రాజామణి ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్వాసితులు మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.


  • రాష్ట్రప్రభుత్వం నుంచే..

పోలవరం పనుల పూర్తికి రూ.12,157 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులు అమితషా, నిర్మలా సీతారామన్‌లను కోరడం.. కేంద్ర కేబినెట్‌ కూడా అందుకు సమ్మతించడం.. ముందస్తుగా రూ.2,300 కోట్లు విడుదల చేయడం తెలిసిందే. ప్రత్యేక ఖాతా తెరిస్తే అందులో ఈ మొత్తం జమ చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర జలవనరుల శాఖ రూ.300 కోట్లే చేసింది. మిగతా మొత్తాన్ని ఇతర అవసరాలకు ఖర్చుచేసింది. ఈ నేపథ్యంలో తామిచ్చిన మొత్తం ప్రత్యేక ఖాతాలో వేస్తేనే తదుపరి నిధులు విడుదల చేస్తామని కేంద్రం తేల్చిచెప్పడంతో రాష్ట్రం గురువారం రూ.815 కోట్లను అందులో జమచేసింది. దీని నుంచే ఇప్పుడు నిర్వాసితుల ఖాతాలకు డబ్బు పడుతోంది.

  • ఇన్నేళ్ల తర్వాత న్యాయం

నా బ్యాంకు ఖాతాలో వ్యక్తిగత పునరావాస పరిహారం కింద రూ.6.36 లక్షలు జమయ్యాయి. 2022లో గోదావరి వరదలకు మా ఇళ్లు మొత్తం కొట్టుకుపోవడంతో రెండేళ్లుగా పునరావాస కాలనీలోనే నివాసం ఉంటున్నాను. అప్పటి నుంచి ప్యాకేజీల కోసం ఎదు రు చూస్తున్నాం. ఇన్ని రోజుల తర్వాత పరిహారం అందడంతో మాకు న్యాయం జరిగింది.

Untitled-4 copy.jpg

- పటాన్‌ వల్లిబాషా, కుక్కునూరు ఏ బ్లాక్‌ నిర్వాసితుడు.

  • చంద్రబాబు రాకతో మేలు

ఏటా గోదావరి వరదలు రాగానే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్లాల్సి వస్తోంది. మళ్లీ గోదావరి వరదలు తగ్గిన తర్వాత ఇంటికి వస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో నిర్వాసితులకు మేలు జరుగుతోంది.

- పిచ్చుక రాజు, ఉపసర్పంచ్‌, కుక్కునూరు

Updated Date - Jan 04 , 2025 | 03:37 AM