AP Govt : అధికారులపై చర్యలు ఎందుకంటే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:50 AM
బైరాగిపట్టెడలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద బందోబస్తు బాధ్యతలను తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రమణకుమార్‌కు అప్పగించారు.

ప్రధాన గేటు తెరిచినందుకు.. డీఎస్పీ రమణకుమార్‌పై వేటు
బైరాగిపట్టెడలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద బందోబస్తు బాధ్యతలను తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రమణకుమార్‌కు అప్పగించారు. ఆ కేంద్రం వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, రోప్ పార్టీని సిద్ధంగా ఉంచుకోవడం, రద్దీ పెరిగినపుడు తొక్కిసలాట, తోపులాట జరగకుండా నియంత్రించడం, కింది స్థాయి అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, అవి అమలయ్యేలా చూడడం ఆయన ప్రధాన బాధ్యత. అయితే కేంద్రం వద్ద భక్తులు నిరీక్షిస్తున్న పద్మావతీ పార్కులో అస్వస్థతకు లోనైన ఓ మహిళను వెలుపలికి పంపడానికి అనాలోచితంగా ప్రధాన గేటు తెరవడంతో పరిస్థితి అదుపు తప్పింది. క్యూలైన్లలోకి పంపడానికే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కపెట్టున దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం సంభవించింది. ఈ కారణంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
రద్దీని పట్టించుకోని గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి
ఎస్వీ గోశాల డైరెక్టర్‌గా తిరుపతిలో పనిచేస్తున్న హరినాథరెడ్డిని టీటీడీ తరపున బైరాగిపట్టెడ కేంద్రానికి ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే భక్తుల రద్దీ పెరుగుతుండటం, గంటల తరబడి వేచివున్న భక్తులు అసహనంగా ఉన్నా ఆయన పట్టించుకోలేదు. పై అధికారులకు తెలిపి టోకెన్ల జారీని ముందస్తుగా మొదలుపెట్టడానికి అవకాశమున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. సకాలంలో భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకపోవడం కూడా ఒత్తిడి పెరగడానికి కారణమైంది. ఈ వైఫల్యాలకు ఆయన్ను బాధ్యుడుగా గుర్తించిన సీఎం సస్పెన్షన్ వేటు వేశారు.
భద్రతా వైఫల్యానికి ఎస్పీ సుబ్బరాయుడు బదిలీ
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసినపుడు అక్కడ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షించాలి. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంతో, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. అయితే తొక్కిసలాటకు భద్రతా వైఫల్యమే కారణం కావడంతో సీఎం ఆయనపై బదిలీ వేటు వేశారు. ఆయన గతంలో చంద్రబాబుకు సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. సన్నిహిత అధికారిగా పేరుపడ్డారు. అలాంటిది ఆయనపై బదిలీ వేటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చర్యతో తప్పు జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టమైన హెచ్చరిక చేసినట్టయింది.
పర్యవేక్షణ బాధ్యతల్లో జేఈవో గౌతమి విఫలం
టీటీడీలో వైద్య, విద్య విభాగాలకు గౌతమి జేఈవోగా వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీచేసే వ్యవహారం మొత్తానికీ ఆమెను ఇన్‌చార్జిగా నియమించారు. తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగా అన్ని శాఖలు, విభాగాలను సమన్వయం చేసుకుని పర్యవేక్షించడంలో గౌతమి విఫలమైనట్టుగా ప్రభుత్వం భావించింది. దీంతో సీఎం ఆమె బదిలీకి ఆదేశించారు. గతంలో ఆమె వైసీపీ పెద్దలకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్న గౌతమిని ఎన్నికల కమిషన్ తప్పించింది. ఎన్నికల నిర్వహణతో సంబంధం లేని టీటీడీకి బదిలీ చేశారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోని సీవీఎస్వో శ్రీధర్
టీటీడీలో నిఘా, భద్రత విభాగానికి శ్రీధర్ బాధ్యుడు. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా దేవస్థానం మొత్తానికీ భద్రత, నిఘా ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయి. అయితే విభాగంపై ఆయనకు పెద్దగా పట్టులేదని, కింది స్థాయి అధికారులపై ఆధారపడతారనే ఆరోపణలున్నాయి. తాజాగా టోకెన్ల జారీ వ్యవహారంలోనూ భక్తుల రద్దీని ముందుగా పసిగట్టలేకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. టోకెన్ జారీ కేంద్రాలను సక్రమంగా పర్యవేక్షించలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో విఫలమయ్యారని భావించిన సీఎం ఆయనను బదిలీ చేయాలని ఆదేశించారు.