Share News

Self-Destruction : విష వలయం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 03:10 AM

గంజాయి, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం

Self-Destruction : విష వలయం!

  • వ్యసనాల ఉచ్చులో యువత

  • గంజాయికి బానిసలై అడ్డదారులు

  • ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లకు అలవాటు

  • లోన్‌ యాప్‌లు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వలలో చిక్కుకుని జీవితాలు నాశనం

  • అప్పుల పాలై.. ఆపై ఆత్మహత్యలు

  • బాధిత కుటుంబాల్లో తీరని విషాదం

  • చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసగా మారాడు. అలాగే సోమల మండలంలో మరో ఇద్దరు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. ఆర్థిక సమస్యలతోపాటు.. గంజాయి, డ్రగ్స్‌ అందుబాటులో లేక ఈ ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు.

  • విజయవాడలోని క్రీస్తురాజుపురం ప్రాంతానికి చెందిన రాంబాబు (20)కు తల్లిదండ్రులు లేరు. అమ్మమ్మ వద్ద ఉంటూ పీవీపీ మాల్‌లోని ఓ షాపులో పనిచేసేవాడు. బెట్టింగ్‌లకు బానిసై లోన్‌ యాప్‌ల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక మూడు నెలల క్రితం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొగల్రాజపురానికి చెందిన జగదీశ్‌ ఇంజనీరింగ్‌ చదివేవాడు. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బాగా అలవాటుపడి భారీగా అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం కానరాక గత ఏడాది ఆగస్టులో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

గంజాయి, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం, అందుకోసం లోన్‌ యాప్‌లలో, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక.. బలవన్మరణాలకు పాల్పడటం! ఇదో మృత్యు వలయం! ఈ వ్యసనాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే వారు కొందరైతే... హత్యలు చేస్తున్న వారు ఇంకొందరు! చోరీల వంటి నేరాలకు పాల్పడేవారూ ఉన్నారు. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ జాడ్యం అన్ని ప్రాంతాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా సాంకేతికత పెరిగాక.. చేతిలోకి 5జీ స్పీడ్‌ సెల్‌ఫోన్‌ వచ్చాక.. యువతలో ఈ విష సంస్కృతి పెరిగింది.


పెళ్లికోసం దాచిన సొమ్ముని, ఇల్లు కట్టటకోవడం కోసం బ్యాంకులో ఉంచిన డబ్బుని, ధాన్యం అమ్మగా వచ్చిన ధనాన్ని ఆన్‌లైన్‌ గేముల్లో తగలేసి.. ఇంట్లో వాళ్లకు విషయం తెలిశాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు. యువత మాత్రమే కాదు.. వివాహమై కుటుంబాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వారు సైతం వ్యసనాలకు బానిసలై భారంగా తనువు చాలిస్తున్నారు. పోతూ పోతూ.. కుటుంబసభ్యులపై మోయలేని భారం మోపుతూ, వారికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.

  • దొంగతనాలు.. దాడులు.. హత్యలు..

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్న వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు ఆ అప్పులు తీర్చేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు. గంజాయి, డ్రగ్స్‌ కోసం దొంగతనాలు, దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏడాది క్రితం శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రానికి చెందిన ఓ లారీ డ్రైవర్‌ను ఇటీవల ఇద్దరు యువకులు బైక్‌ ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇటుకలతో దాడి చేశారు. డ్రైవర్‌ ఎలాగోలా తప్పించుకుని లేపాక్షికి చేరుకున్నారు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితులు గంజాయి మత్తులో ఈ హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురంవద్ద జూలైలో గంజాయి సేవించిన కొందరు యువకులు అదే గ్రామానికి చెందిన సతీశ్‌ (42) అనే వ్యక్తిని ఊరుబయటకు తీసుకెళ్లి కిరాతకంగా కొట్టి చంపేశారు. గంజాయి మత్తులో హత్యచేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని శాంతి టాకీస్‌ సమీపంలో ద్విచక్ర వాహనం ఇవ్వనందుకు ఓ వ్యక్తిపై సల్మాన్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన మరో ఇద్దరినీ కత్తితో పొడిచాడు. నిందితుడు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు తేల్చారు.


  • ఆత్మహత్యకు పురిగొల్పుతున్న లోన్‌ యాప్‌లు

గంజాయి, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వంటి వ్యసనాల బారిన పడినవారు.. తక్షణ అవసరం కోసం వెంటనే అప్పు ఇచ్చే లోన్‌ యాప్‌లు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయిస్తూ.. వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ‘ఎటువంటి పత్రాలతో పనిలేకుండా.. తక్షణమే రుణం పొందండి’ అంటూ లోన్‌ యాప్‌లు అదే పనిగా మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ పంపిస్తుండడంతో బాధితులు అప్పటికే డబ్బు కోసం ఎదురు చూస్తుండడంతో.. సదరు లోన్‌ యాప్‌ నుంచి వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో అతని మొబైల్‌లోని వివరాలన్నీ వెంటనే లోన్‌ యాప్‌ నిర్వాహకులకు చేరిపోతాయి. రుణం తీసుకున్నాక తిరిగి చెల్లించకపోతే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పటికే బాధితుడి మొబైల్‌ నుంచి వివరాలను సేకరించిన యాప్‌ నిర్వాహకులు.. అతడి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నగ్న చిత్రాలను అతని కాంటాక్టు లిస్టులో ఉన్నవారికి పంపించడం మొదలుపెడతారు. అంతేకాకుండా.. కాంటాక్టు లిస్టులో ఉన్నవారికి ఫోన్లు చేసి బాధితుడి అప్పు గురించి చెబుతారు. అతనితో సంబంధం ఉన్నందున ఆ అప్పును వారు కూడా చెల్లించాలని బెదిరిస్తారు. ఇలా పరువు బజారున పడడంతోపాటు వేధింపులకు తాళలేక బాధితులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి.


  • వ్యూహం మార్చిన గంజాయి ముఠాలు

గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దాన్ని వినియోగిస్తున్న వారికి ఏదో రకంగా అది లభిస్తూనే ఉంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంతోపాటు ఒడిశా నుంచి కూడా గంజాయి సరఫరా అవుతోంది. రాష్ట్రంలో గంజాయి రవాణాకు పోలీసులు అడ్డుకట్ట వేస్తుండడంతో.. గతంతో పోలిస్తే దీని వినియోగం కొంత మేరకు తగ్గింది. అయితే విక్రయ ముఠాలు వ్యూహం మార్చి కొత్తరూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నాయి. గతంలో క్వింటాళ్ల చొప్పున గంజాయిని వాహనాల్లో తరలించగా.. ఇప్పుడు తక్కువ పరిమాణంలో కొలోల చొప్పున తరలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. ఒకవేళ పట్టుబడినా.. తక్కువ పరిమాణంలో ఉన్నందున కేసు నుంచి కూడా త్వరగా బయటపడతామన్న ఆలోచనతో ఈ వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఇదే కాకుండా.. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి అతితక్కువ పరిమాణంలో తరలిస్తున్నారు. ఒకటి రెండు లీటర్ల పరిమాణంలో తీసుకొస్తూ బస్సుల్లో, ఇతర వాహనాల్లో సులువుగా తరలిస్తున్నారు. అనంతరం దాన్ని ‘హ్యాష్‌ ఆయిల్‌’ పేరుతో అతి తక్కువ పరిమాణంలో 5 గ్రాములు, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ట్యూబ్‌లలో విక్రయిస్తున్నారు.

  • ఒకే కుటుంబంలో నలుగురు బలి

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలం ఎగవూరు గ్రామానికి చెందిన నాగరాజులరెడ్డి కుమారుడు దినేశ్‌ కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగులతో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఈ ఏడాది అక్టోబరు 4న కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద నాగరాజులరెడ్డి (61), ఆయన సతీమణి జయంతి (50), కుమార్తె సునీత (26), కుమారుడు దినేశ్‌ (22)లను తమిళనాడులోని రాణిపేట సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ నాలుగు రోజుల వ్యవధిలో నలుగురూ మరణించారు.

Untitled-2 copy.jpg


  • రాష్ట్రంలో విషాద గాధలు

  1. చిత్తూరులోని దుర్గా నగర్‌ కాలనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ.. ఆన్‌లైన్‌ బెట్టింగులకు బానిసగా మారాడు. ఈ క్రమంలో అప్పులు చేసిమరీ రూ.36 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల కిందట ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు.

  2. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో దిలీ్‌పరెడ్డి అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి 2022లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారి డబ్బులు పోగొట్టుకున్నాడు. చదువుపై ఏకాగ్రత కూడా కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.

  3. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తా కోడళ్లపై అక్టోబరులో సామూహిక అత్యాచారం జరిగింది. నిందితులు ఎరుకల కావడి నాగేంద్ర, సాకె ప్రవీణ్‌కుమార్‌, చాకలి శ్రీనివా్‌సతోపాటు మరో ముగ్గురు మైనర్లు గంజాయి సేవించి, ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

  4. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని మోతుకపల్లివద్ద చందు, రోహిత్‌ అనే ఇద్దరు స్నేహితులు పరస్పరం దూషించుకున్నారు. రోహిత్‌ను చందు కత్తితో పొడిచాడు. వీరిద్దరూ గంజాయి మత్తులో గొడవపడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో ఒకరు గంజాయి విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క హిందూపురంలోనే 50 మంది గంజాయి విక్రేతలు, వినియోగదారులను అరెస్టు చేశారు.

  5. అనంతపురం రూరల్‌ మండలం పామురాయికి చెందిన పప్పూరు రామాంజినేయులు (28) వ్యవసాయ కూలీగా జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై అప్పులు చేశాడు. అప్పులవారి నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచక పది రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.

Untitled-3 copy.jpg

Updated Date - Jan 04 , 2025 | 03:11 AM