Son: అమ్మను బయటికి గెంటేశారు!
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:15 AM
! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో..

కోడలికి ఇల్లు అప్పగించాలన్న కోర్టు
పోలీసులు, కోర్టు సిబ్బంది సమక్షంలో ఇంటికి తాళం వేసిన కొడుకు
రోడ్డున పడ్డ తల్లి.. విజయనగరం జిల్లాలో ఘటన
గరివిడి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): నవమాసాలూ మోసి.. కని పెంచిన తల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేశాడో కొడుకు! నడవడానికి కాళ్లు కూడా సహకరించని ఆమెను కట్టుబట్టలతో కుర్చీతో పాటే బయటికి గెంటేశాడు. కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఉదంతం జరగడంతో, దిక్కుతోచని ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం గొట్నంది గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలివీ.. గొట్నంది గ్రామంలో నక్క ఎర్రమ్మకు (85) భర్త లచ్చుం నిర్మించిన ఇంట్లో ఉంటోంది. భర్త రెండేళ్ల కిందట మృతిచెందాడు. వృద్ధాప్య పింఛనుతో ఆమె జీవనం సాగిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు రామారావు, సింహాచలం, కుమార్తె రవణమ్మ ఉన్నారు. పెద్ద కుమారుడు రామారావు విశాఖలో, చిన్నోడు సింహాచలం హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుమార్తె రమణమ్మ మెరకముడిదాం మండలం సాతంవలసలో ఉంటోంది. 2016లో చిన్న కుమారుడి భార్య సంజీవి పేరిట ఇల్లు మంజూరైంది. దీంతో ఎర్రమ్మ, లచ్చుం దంపతులు పూరిల్లును కూల్చి చిన్నకోడలు పేరిట మంజూరైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆ సమయంలో ఎర్రమ్మ దంపతులు రూ.80వేలు వెచ్చించారు. అయితే, ఆ ఇల్లు తనకే చెందాలని చిన్నకొడుకుసింహాచలం కొద్ది సంవత్సరాలుగా అన్న రామారావుతో గొడవ పడుతున్నాడు. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. విచారణ అనంతరం సింహాచలం భార్య సంజీవికే ఇల్లు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సింహాచలం మంగళవారం పోలీసులు, కోర్టు సిబ్బంది సమక్షంలో.. ఇంట్లో ఉన్న తల్లిని బయటికి నెట్టేసి తాళ ం వేసి వెళ్లిపోయాడు. స్థానికులు చెబుతున్నా వినిపించుకోలేదు. అయితే, తాను బతికున్నంతవరకు ఈ ఇంటిలోనే ఉంటానని.. ఇది తానూ.. తన భర్త కష్టపడి కట్టుకున్న ఇల్లని ఎర్రమ్మ ఆవేదనను వ్యక్తం చేస్తోంది. ఆ తర్వాత ఆ వృద్ధురాలు గ్రామపెద్దల సహకారంతో బుధవారం గరివిడి పోలీసులను ఆశ్రయించింది.