Srisailam Dam : శ్రీశైలం ఖాళీ
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:36 AM
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు.

అయినా తెలంగాణ విద్యుదుత్పత్తి
తాజగా 19,070 క్యూసెక్కులు దిగువకు విడుదల
859.80 అడుగులకు పడిపోయిన జలాశయం నీటి మట్టం
రాయలసీమ రైతాంగం ఆందోళన.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద
1,622 టీఎంసీల ప్రవాహం.. ఇందులో విద్యుదుత్పత్తి పేరిట 558 టీఎంసీలు సాగర్‌కు.. ప్రస్తుత నిల్వల నుంచే రబీలో సాగునీరివ్వాలి
జూలై వరకు తాగునీటికి ఇవ్వాలి.. అడవుల్లో వన్యప్రాణుల దాహార్తీ తీర్చాలి
90 టీఎంసీలకు తగ్గకుండా నిల్వ కొనసాగించాలి
కృష్ణా బోర్డుపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి.. సాగునీటి నిపుణుల వినతి
కర్నూలు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు, తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు. కానీ ఇప్పటికే విద్యుదుత్పత్తి రూపంలో తెలంగాణ 358.94 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199.38 టీఎంసీలను (మొత్తం 558.32 టీఎంసీలు) దిగువ నాగార్జునసాగర్‌కు వదిలేశాయి. రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ తరువాత వేసవి తాగునీటి అవసరాలు సరేసరి. మరోవైపు నల్లమల అభయారణ్యంలో వన్య ప్రాణుల మనుగడ కోసం అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. డ్యాంలో నీటి నిల్వ 105.39 టీఎంసీలకు పడిపోయాయి. అయినా తెలంగాణ ప్రభుత్వం అడపాదడపా విద్యుదుత్పత్తి పేరిట నీటిని తోడేస్తోంది. బుధవారం ఇలా 19,070 క్యూసెక్కులు (దాదాపు 1.65 టీఎంసీలు) దిగువకు విడుదల చేయడంపై రాయలసీమ సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వలు 810 అడుగుల లెవల్‌కు తగ్గకుండా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
ఆ దిశగా కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు. 2024-25 నీటి సంవత్సరంలో (జూన్ 1 నుంచి మే ఆఖరి వరకు) 1,622.61 టీఎంసీల వరద వచ్చింది. గతేడాది తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి.. పెట్టుబడి మట్టిపాలై ఆర్థికంగా చితికిపోయిన రాయలసీమ కరువు రైతులు ఈ ఏడాది సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు, కష్టాలూ ఉండవని భావించారు.నంద్యాల, కడప జిల్లాలకు, నెల్లూరు జిల్లాకు సాగు, తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 203.30 టీఎంసీలు.. కర్నూలు, అనంతపురం జిల్లాలకు హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నుంచి 20.55 టీఎంసీలు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా 0.60 టీఎంసీలు కలిపి 224.45 టీఎంసీలను రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 26.86 టీఎంసీలు తీసుకుంది. శ్రీశైలం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు. ఆపైన వరదొచ్చి క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు వరద వదిలేయాల్సి వచ్చినప్పుడు.. విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదిలేయవచ్చు. అప్పుడు ఎలాంటి నీటి ఇబ్బందులూ ఉండవని సాగునీటి నిపుణులు అంటున్నారు. అయితే.. నిల్వ చేసిన నీటిని విద్యుదుత్పత్తి పేరిట దిగువకు వదిలేయడం నీటి సమస్యలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి కోసం 358.94 టీఎంసీలు (డ్యాం చేరిన మొత్తం వరదలో 22.12 శాతం), ఆంధ్రప్రదేశ్ కూడా 199.38 టీఎంసీలు (డ్యాం చేరిన మొత్తం వరదలో 12.28 శాతం) దిగువకు వదిలేశాయని ఇంజనీర్లు తెలిపారు.
ప్రస్తుతం డ్యాంలో 859.80 అడుగుల్లో 105.39 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జూలై వరకు రాయలసీమ తాగునీటి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో పర్యావరణ సమతుల్యత కాపాడడం, నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల నీటి అవసరాల కోసం 810 అడుగుల లెవల్‌లో 90 టీఎంసీలకు తగ్గకుండా నీటి నిల్వను కొనసాగించాలని నిపుణులు పేర్కొంటున్నారు.అయితే.. తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరిట నీటిని దిగువకు విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. సీమ రైతాంగం తీవ్ర ఆందోళనకు లోనవుతోంది. జస్టిస్ బచావత్ (కేడబ్ల్యూడీటీ-1) అవార్డు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సూచనల మేరకు రాబోయే ఖరీఫ్ ప్రారంభం వరకు 854 అడుగుల లెవల్‌కు తగ్గకుండా.. క్యారీ ఓవర్ కింద 60 టీఎంసీలు తగ్గకుండా నిల్వను కొనసాగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రూల్ కర్వ్, క్యారీ ఓవర్ అమలు చేసేలా కృష్ణా బోర్డుపై రాయలసీమ జిల్లాల ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
సాగర్‌లో నీరున్నా.. శ్రీశైలాన్ని ఖాళీచేస్తారా?
బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు
నాగార్జునసాగర్‌లో 248.49 టీఎంసీలు ఉండగా.. శ్రీశైలంలో ఉన్నది కేవలం 105.39 టీఎంసీలే. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంను ఖాళీ చేయడం ఎంతవరకు సబబు? దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించాలి. సాగర్ ఆయకట్టుకు 264 టీఎంసీలు మాత్రమే వాడుకోవాలని ట్రైబ్యునల్ స్పష్టంగా చెబుతోంది. ఇందుకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి పేరిట దిగువకు నీటిని వదిలేయడం సరికాదు.