Supreme Court : నందిగం సురేశ్‌కు సుప్రీం షాక్
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:32 AM
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో సురేశ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ.. నేర చరిత్రను దాచడంపై ఆగ్రహం
మరియమ్మ హత్య కేసులో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరణ
న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో సురేశ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. 2020లో ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు మండలం, వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ ఇంటిపై అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆమె మరణించారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాటి ఎంపీ సురేశ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం సురేశ్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కేసు తీవ్రతను గుర్తించిన హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఽహైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం ఈ పిటిషన్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినప్పుడు సురేశ్ తనపై ఎలాంటి నేరచరిత్ర లేదని చెప్పారని, కానీ అప్పటికే ఆయనపై ఐదు కేసులు ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు. సురేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెయిల్ మంజూరుకు నేరచరిత్రతో సంబంధం లేదన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం నేరచరిత్రను దాచిపెట్టడం గమనించదగ్గ అంశమని పేర్కొంది. పాత కేసుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయనందున తాము కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పేర్కొంది. హత్య కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగంకు సూచిస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.