Share News

వైసీపీకి చుక్కెదురు

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:47 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయించేందుకు ప్రయత్నించిన వైసీపీకి సుప్రీంకోర్టులో భంగపాటు తప్పలేదు.

వైసీపీకి చుక్కెదురు

  • చంద్రబాబు బెయిల్‌ రద్దుకు విఫలయత్నం

  • రూ.కోట్ల ఖర్చుతో సీనియర్‌ లాయర్లను పెట్టినా దక్కని ఫలితం: టీడీపీ

అమరావతి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయించేందుకు ప్రయత్నించిన వైసీపీకి సుప్రీంకోర్టులో భంగపాటు తప్పలేదు. నాటి ప్రభుత్వం వేసిన ఆ పిటిషన్‌ వెనుక వైసీపీ నాయకత్వం ఉందని.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్‌ న్యాయవాదులను మోహరించినా ఆ పార్టీకి ఫలితం దక్కలేదని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. తమ ప్రయత్నం ఫలించి చంద్రబాబు బెయిల్‌ రద్దవుతుందని వైసీపీ నాయకత్వం బలంగా విశ్వసించిందని, అందుకే రెండు నెలల్లో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం జగన్‌ పదేపదే చెబుతూ వచ్చారని పేర్కొన్నాయి. జగన్‌ ప్రభుత్వం స్కిల్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజులు జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే.


హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో 2023 అక్టోబరు 31న ఆయన విడుదలయ్యారు. ‘మా అధినేతపై అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఇప్పుడు బెయిలు రద్దుకు కూడా వైసీపీ నేతలు తెగించారు. కానీ వారి కుట్రలు సుప్రీంకోర్టు ముందు పారలేదు. ఈ కేసులో చార్జిషీటు కూడా దాఖలైంది. సాంకేతిక కారణాలతో కోర్టు దానిని తిప్పిపంపింది. చంద్రబాబుకు బెయిల్‌ వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇప్పుడు బెయిల్‌ రద్దుపై వాదనలు వినడానికి కూడా కోర్టు ఇష్టపడలేదు. సంబంధం లేని వ్యక్తులు ఆయన బెయిల్‌ రద్దుచేయాలంటూ దరఖాస్తు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. ఇతరులు ఇందులో తలదూర్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఈ కేసుతో మీకేం సంబంధమని ప్రశ్నించింది. తన దిక్కుమాలిన ప్రయత్నాలతో వైసీపీ కోర్టు ముందు నవ్వులపాలైంది’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు అన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 04:47 AM