NRI Assistance: మదీనాలో మరణించినా.. మాతృభూమికి!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:13 AM
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.

టీడీపీ సహకారంతో స్వదేశానికి గుంటూరు మహిళ మృతదేహం
ABN AndhraJyothy: సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం. మక్కా, మదీనాల్లో మరణించిన యాత్రికులను స్థానికంగానే ఖననం చేస్తారు తప్ప.. స్వదేశాలకు తరలించడానికి ఇష్టపడరు. అయితే, ఇస్లాం తీర్థయాత్రలో భాగంగా మదీనాకు వచ్చిన గుంటూరుకు చెందిన అబిదా సుల్తానా అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 21న మరణించారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్తానంటూ భర్త సిరాజ్ ఖాదర్ బేగ్ పట్టుబట్టారు. మృతురాలి బంధువులు టీడీపీ ఎన్నారై విభాగాన్ని సంప్రదించగా ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్ ఈ విషయాన్ని సౌదీలోని టీడీపీ ఎన్నారై ప్రతినిధి జానీ బాషా, ఏపీ ఎన్నారై కోఆర్డినేటర్ ముజ్జమ్మీల్ షేక్‌ల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి సహకరించడంతో ఇటీవల అబిదా బేగం మృతదేహాన్ని భారతదేశానికి తరలించారు.
- ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి