Nellore : దంపతులను మింగేసిన పొగమంచు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:55 AM
దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం
నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘటన
సంగం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా సంగం మండ లం వెంగారెడ్డిపాలెం వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిందీ ప్రమాదం. సంగం మండలం అనసూయనగర్ గ్రామానికి చెందిన నెల్లూరు వెంకటశేషయ్య(35), వెంకట వరలక్ష్మి(30) దంపతులు ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం ఉదయం 6.30 గంటలకు దంపతులిద్దరూ ఇంటి నుంచి ఆటోలో సంగం బయలుదేరారు. పొగమంచు దట్టంగా ఉండటంతో రహదారిపై వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో నెమ్మదిగా వెంగారెడ్డిపాళెం రోడ్డు దాటి కొంత దూరం వచ్చారు. అక్కడ ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తూ వీరి ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ఆటో నడుపుతున్న వెంకటశేషయ్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఆటో వెనుక సీట్లో కూర్చున్న వరలక్ష్మికి తీవ్రగాయాలవడంతో నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, అక్కడ మరణించారు.