Share News

Land Encroachments : చనిపోయినా.. ఊరు విడిచినా భూములు ఫట్‌

ABN , Publish Date - Jan 21 , 2025 | 05:07 AM

వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్‌కు బారులు తీరారు.

 Land Encroachments : చనిపోయినా.. ఊరు విడిచినా భూములు ఫట్‌

  • వైసీపీ నేతల దందాలపై టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనేక మంది బాధితులు టీడీపీ గ్రీవెన్స్‌కు బారులు తీరారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్‌, కొప్పుల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీజీ కుమార్‌ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం గుంటుకాని పల్లెకు చెందిన అవసాని రమణయ్య అర్జీ ఇస్తూ, ఎవరైనా చనిపోయినా.. బతుకుదెరువు కోసం ఊరు విడిచి వెళ్లినా.. వారి భూముల్ని కొనుగోలు చేసినట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా భాస్కర్‌రెడ్డి కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాగే తమ భూమిని కొట్టేశారని, దీనిపై కోర్టు తమకు అనుకూలంగా తీర్చు ఇచ్చినా, వైసీపీ కబ్జాదారులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అండతో తుమ్మా వెంకట కృష్ణారెడ్డి, అతడి అనుచరులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసిన భూముల్ని విడిపించాలని గుంటూరు జిల్లా కొత్త బొమ్మువానిపాలేనికి చెందిన తుమ్మా శివరామిరెడ్డి కోరారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరులు తమ ప్రహరీ గోడను ధ్వంసం చేశారని తిరుపతికి చెందిన శ్యామలాదేవి వాపోయారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో భూమిని తీసుకుని, పరిహారం ఇవ్వలేదని ఏలూరు జిల్లా లక్కవరానికి చెందిన కేవీ రమణమ్మ వాపోయారు.గుంటూరులోని బుద్ధమెగాషెక్త ఫౌండేషన్‌ వారు టీచర్‌ ఉద్యోగాల పేరుతో రూ.45కోట్లు దాకా దండుకుని, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విశాఖ మధురవాడకు చెందిన సునీత ఫిర్యాదు చేశారు.

Updated Date - Jan 21 , 2025 | 05:08 AM