Share News

Vijayawada Police: 5న విచారణకు రండి

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:08 AM

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Vijayawada Police: 5న విచారణకు రండి

  • మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బెజవాడ పోలీసుల నోటీసులు

  • పోక్సో కేసులో బాధితుల పేర్ల వెల్లడిపై గత ఏడాది ఫిర్యాదు

  • కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు

అనంతపురం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోక్సో కేసులో బాధితుల వివరాలను మీడియా సమావేశంలో ఆయన బహిరంగంగా వెల్లడించారంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గత ఏడాది నవంబరు 2న ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు బీఎన్‌ఎస్‌ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి విజయవాడ నుంచి వారు అనంతపురం వచ్చి మాధవ్‌ నివాసానికి వెళ్లారు. ఈ కేసులో మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలని సూచించారు. విజయవాడ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని, అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరగడంతో మాధవ్‌ అనుచరులు, వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయారు. కాగా.. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న మాధవ్‌ మీడియాపై నోటి దురుసు ప్రదర్శించారు. ‘పోలీసు ఆఫీసర్‌గా పనిచేశారు కదా..! పోక్సో కేసులో బాధితుల పేర్లు బయటకు చెప్పకూడదనే విషయం తెలియదా..’ అని విలేకరులు ప్రశ్నించడంతో ఆయన వారిపై ఆవేశంతో ఊగిపోయారు. ‘మీది ఏ టీవీ..? ఏ మీడియా..? ఏ పత్రిక..’ అంటూ చిందులు వేశారు. తర్వాత నోటీసులపై స్పందిస్తూ... తన న్యాయవాదులతో చర్చించి.. మార్చి 5న విచారణకు వెళ్లాలో లేదో నిర్ణయించుకుంటానని తెలిపారు. ఆ రోజు తనకెలాంటి కార్యక్రమాలూ లేకపోతే విచారణకు హాజరవుతానని, లేదంటే గడువు కోరతానని చెప్పారు.

Updated Date - Feb 28 , 2025 | 05:08 AM